'బాపిరాజు'
నివసించడానికి లోనిగదులు, శిలాతల్పాలు, ద్వారశిల్పాలంకారాలు, గర్భగృహశిల్పాలు, తధాగత గంభీర శిల్పమూర్తి, ఆసనము, ఛత్రము, తోరణాలు, ధర్మచక్రము - అన్నీ పూర్తిఅయ్యాయి, వివిధదేశాలనుంచి శిల్పము, చిత్రలేఖనము నేర్చుకోవచ్చిన శిష్యులు, పనివాండ్రు చిత్రలేఖనాలంకారము పూర్తి చేస్తున్నారు.
మహాశిల్పి, చిత్రభవన నిర్మాణ కళాకౌశలి మా గురువులున్నూ తమ శిష్యులతోపాటు మధ్యమండప మంతా జాతకగాథలు, అలంకారచిత్రములు వేస్తున్నారు.
ఒకచోట ఒకశిష్యుడు చిత్రకల్పనచేసి గురువులకు చూపిస్తున్నాడు. గురువులు దానిని సవరించి వేయవలసిన వర్ణాలు చెప్పి వేరొక చోటకు వెళ్తారు. వర్ణాలు పూర్తిచేసి వేరొకశిష్యుడు నివేదిస్తాడు. గురువులు రంగుల పాత్రలలో తూలికలు ముంచి చిత్రంలో తప్పు దిద్దుతున్నారు. గురువులే వేరొకచోట రూపకల్పన కల్పించి నలువురు శిష్యులచే వర్ణాలు నింపించుతున్నారు. చిత్రకల్పన, రూపసృష్టి, వర్ణికా పూర్ణము అంతా మా గురువులే కొన్ని చోట్ల సంకల్పించి అద్భుతభావాత్మక కళావైదగ్ధ్యము ప్రత్యక్షముచేస్తున్నారు. దినముదినమూ ఆ విచిత్రోత్సవము సందర్శిస్తూ గుండెలు నృత్యాలుసల్ప ముగ్ధనైపోతూ ఉంటిని. నా కళ్లు అరమూతలు పడినై; నా యవ్వనము పొంగి దిశలంటినది. నా అంగుళులు విధాతృసృజనా భావాలై కల్పనకై యోగనిష్ఠ వహింప ఉన్ముఖాలైనవి.
8