ఈ పుట ఆమోదించబడ్డది
'బాపిరాజు'
ఒక వారంరోజులు ఆటాగీటా తలపెట్టకు. ఓపికపట్టి మాత్రం యెదురు చూస్తూ వుండు" అని చెప్పి, ఆ చీకట్లలో మాయమై పోయాడు. వీరయ్యకు ఆశ్చర్యం వేసింది. కామేశ్వర్రావు గారు యేమిచేస్తారా అని అనుకుంటూ తన గుడిశెప్రక్క ఆరు బయట వేసిన నులక మంచము మీద నిద్రపోతూ వున్న మనమరాలిని చూసి "తల్లీ నీకు మీనాక్షీదేవి పేరు పెట్టుకొన్నాను. ఏంచేస్తావో?" అని తలపోసుకున్నాడు.
9
బందరులో వుండే ఉద్యోగస్థులకు, వర్తకులకు, భాగ్యవంతులకు, ఒక రోజున ఆహ్వానపు పత్రికలున్న కవర్లు వచ్చాయి.
గొప్ప సంగీతపు ప్రదర్శనం
శ్రీమతి మీనాక్షిబాయి
ఆర్యా!
అభినవ మీర యనదగిన ఈ బాలిక కంఠము మాధుర్యాతి మాధుర్యము, పాండిత్యము పండితుల చేతనూ మెప్పు పొంద దగినది. కాన తాము విచ్చేసి ఈ బాలికా గాన పవిత్రతలో దివ్యులుకండని మా ప్రార్థన.
కామేశ్వరరావు, ఎం. ఏ.,
సీతారామయ్య.
మచిలీపట్టణము,
16 - 4 - 1924.
80