బొమ్మలరాణి
3
గాయకశ్రేష్ఠుడు సంగీతశాస్త్రపండితో త్తముడు సీతారామయ్యగారు, భీమవరంలో తోలుబొమ్మలాట అయిన వారంరోజుల వెనక ఓ సాయంత్రం ఇంట్లో కూచొని ఫిడేలు వాయించుకుంటున్నాడు. తన ఫిడేలు వాద్యం శ్రుతికాగా, వీథిలో తోలుతిత్తిశ్రుతిలో పంచమస్వరంలో చక్కని పాట విన్నాడు. ఆయన ఫిడేలును క్రిందపెట్టి వీధిలోకి వెళ్లాడు. ఒకబాలికా, ఒక ఆడమనిషి ముష్టికోసంవచ్చారు. పధ్నాలుగేళ్ళు యీడువున్న బాలిక పాడుతున్నది. నడిమివయస్సు గల స్త్రీ తిత్తి ఊదుతున్నది. సీతారామయ్యగారు మొన్న తోలుబొమ్మలాటలో, ముచ్చటపడుతూ విన్న కంఠమే యిది.
"అమ్మాయీ! నీకు వీరయ్య ఏమౌతాడు?"
"మా తాతయ్యండి."
"ఈ మని షెవరు?"
"మా అమ్మండి."
"నీకు సంగీతం ఎవరు నేర్పారు?"
"మా తాతయ్య నేర్పాడు సామీ."
"నీకు సంగీతం నేర్పితే నేర్చుకుంటావూ?"
తల్లి -- "సామీ అంత అదృష్టం మాకు పడుతుందాండీ?'
"అదృష్టానికేముందిలే. ఇటువంటి కంఠం క్రమమైన సాధనలేకపోతే దోహదం లేని పూలచెట్టులా ఉంటుంది.
59