'బాపిరాజు'
ఇంకో హరిజన పాపాయి ప్రపంచంలోకి వచ్చింది. అదీ విసిరేసినట్లు ఊరిబయట! దానికీ చింపిబట్టలు. దానికీ తలదువ్వుకోటానికి నూనె వుండదు! దానికీ చదువు వుండదు! దానికీ కడుపునిండా తినడానికి తిండివుండదు! అదీ రుద్రేశ్వరం గుడియెదుట గుళ్ళోకి వెళ్ళబోయి ఏ మా అన్నయ్య వల్లనో తన్నులు తినాలి.
నాకు దడదడయెత్తి ముచ్చెమ్మటలు పోశాయి. నరసన్నను మా అన్నయ్య రుద్రేశ్వరం దేవాలయం ఎదుట శివరాత్రినాడు చావగొట్టాడు కాదూ !
ఆ హరిజన పాపాయీ వాళ్లమ్మా నీళ్లుపోసుకొని వాళ్ల గూడెం వెళ్లిపోయారు. చిట్టి కృష్ణుని లా తయారయింది ఆ చిట్టిపాప. పదిహేను రోజులలో వుంగరాలజుట్టు, అల్ల నేరేడు పండు లాంటి ముక్కు, నల్లదొండ పళ్లు దాని పెదవులు, గవ్వలలాంటి వేళ్లు, ఆ బొజ్జ, ఆ చిన్న కాళ్లు, ఆ చిన్నారి చేతులు అందాలు ఒలకపోసుకుంటూ నులకమంచంమీద దొర్లడమే! నేనూ మా ఆయనా రాత్రిళ్ళ ప్పుడు నరసన్న ఇంటికిపోయి రత్తాలు నీ, పాపాయి నీ చూచి వచ్చే వాళ్ళం!
నా చీరలూ, దుప్పట్లూ దొళ్ళదోపిడీ ఇచ్చాను. ఆ చిన్న పాపాయికి చిట్టి చొక్కాలు ఎన్నో కుట్టి ఇచ్చాను. ఆ ముద్దుపాపను చూచినపు డల్లా మా ఆయన చిన్నిపాపడై కన్పించేవారు. నా రవికజేబులు పిక్కటిల్లేవి.
48