పుట:Bhagira Loya.djvu/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
నరసన్న పాపాయి
 

నాకు తల దువ్వింది. నా ఒళ్లు ఝల్లుమంది. నరసన్న రుద్రేశ్వరం గుడిలోకి వెళ్ళినట్లయింది. గుడిలోకి వెళ్ళినా వెళ్ళని నేను! గుడిలోకి వెళ్ళబోయే మా అన్నయ్యచేత దెబ్బలుతిన్న నరసన్న! నరసన్న భార్య నాకు తలదువ్వింది. నేను నరసన్న భార్య రత్తాలు తల దువ్వాను.

ఓట్ల రోజులు. కాంగ్రెసువారికీ కమ్యూనిస్టులకూ పోటీ.

మాల మాదిగలలో - వాళ్ళని హరిజనులంటారు - కాంగ్రెసువాళ్ళనీ కమ్యూనిస్టులనీ ఏదో ఫెడరేషననీ యీ ముగ్గురికీ పోటీ!

మా ఆయన నరసన్నను పోటీ చేయమన్నారు. ఆయన కాంగ్రెసువారు. నరసన్న చిన్నతనంలో చదవలేదు. కాని మా వారే రోజూ నరసన్నకు చదువు చెప్పారు. అతనికి వచ్చిన చదువు యెంతో పెద్దది. రుద్రేశ్వరుని గుడియెదుట మా అన్నయ్య కొట్టిన దెబ్బలు అతనికి ఓనమాలు.

ఎంతమంది హరిజనులు గుళ్ళయెదుట, బజారులలో, అంగళ్ళ వీధిలో, పొలాలలో దెబ్బలు తినటం లేదు?

వాళ్లు ఏ దేవుణ్ణి చూడగలరు? వెంకటేశ్వరుడు, చిదంబరస్వామి, రామలింగేశ్వరుడు, శ్రీరంగశాయి వాళ్లకు కనబడతారా? మా రుద్రేశ్వరుడే నరసన్నకు కనపడలేదు.

నరసన్న భార్య కడుపుతో వుంది! నరసన్నకు కొడుకు పుడ్తాడా, కూతురా? ఆ పాపాయికి రుద్రేశ్వరుడు కనబడడు.

'రత్తాలూ! చదువుచెప్తా చదువుకోవూ?' అన్నాను.

45