ఈ పుట ఆమోదించబడ్డది
భోగీరలోయ
పగపట్టిన పన్నగిలా ఆ లోయలోనికి చొచ్చుక పొయ్యాను.
ప్రతివంకరకూ ప్రత్యక్షమైన ప్రకృతి దృశ్యసౌందర్యం మహాకావ్యం లో పుటలు తిప్పినప్పటి రసానుభూతిలా గున్నది.
నాలుగు మెలికలు. ఒక్కొక్కమెలిక మూడువందల ధనువులు. అర్థానుస్వారరూపమై ఎప్పటికప్పుడు ఆఖరులా తోచిన ఆ మెలికలో రెండువైపులా నదీ దేవత సంతరించిన నలభై నిలువుల యెత్తు నల్ల రాతిగోడలు. చెట్లు దట్టంగా పెరిగిన కొండచరియలు, వాటిపై నీలాలశిఖరాలు, కారు దున్నల్లా, భయంకరమైన ఖడ్గమృగాలల్లా పడివున్న నల్లరాతిబండల్లో, ముప్పైధనువుల వెడల్పున రాగమాలికలు పాడుకుంటూ భోగీర ప్రవహిస్తున్నది.
పారిజాతవనాలు, అడవిమల్లెలు, ఇప్పచెట్లు, చీకటి మానులు, నల్లమద్దులు, రేగులు ఆ కొండచరియలనిండా ఉన్నవి.
5