పుట:Bhagira Loya.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోగీరలోయ

ఆ మరునాటి నుంచీ ఆయన నన్ను తన కడకే పిలిపించుకొని చిత్రవిద్యలోని రహస్యాలు మహా గాంధర్వంలా ఉపదేశించ మొదలుపెట్టారు. ఆయన రూపమే మారి పోయింది. ఏదో వింత శక్తి చేత అలుముకుపోయినారు. కొద్ది మాటలతో మాత్రమే వినేవాళ్ళ తృప్తిని తీర్చే ఆయన ఆ నాటి నుంచీ ఝరీవేగంతో, తియ్యని గొంతుకతో ఘటికలు ఘటికలు మాట్లాడేవారు. ఎందుకో? ఏవేవో ప్రశ్నలు నాపై వర్షము కురిపించే వారు. ఆ రోజుల్లో నాకు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. ఆయన కడ సంతతము వుండ బుద్ధి. ఆయన పాదాంగుళులను పువ్వుల మొగ్గలను ముట్టినట్లు ముట్టి కళ్ళ కద్దుకోవటానికి కాంక్ష. ఉన్నట్లుండి నా కేదో వివశత్వం!

“కల్హారమాలికా! ఈ చిత్రవిద్య పూర్తియైన ఆ వెనక నీ వేమి చేయదలచుకొన్నావు?”

“బుద్ధదేవుని చరిత్ర రచించుకొంటూ నా జీవితం పవిత్రం చేసుకోవాలన్న కోరికే నన్ను కదిల్చి వేస్తోంటుంది. అంతకన్న నా మొరకు హృదయాని కేమీ తోచదు.”

“మానవుల్లోని దివ్యత్వమే కళాస్వరూపమై వెలువడు తుంటుంది. నిశ్చయమే. కాని వివాహమైన వెనక నీ దీక్ష యెట్లా సాగుతుంది కుమారీ?”

“ప్రభూ! నేను వివాహమే చేసుకోను.”

“అది అసంభవము. మీ తండ్రిగా రేరాజన్యునికో నిన్ను నివేదిస్తారు. నీవు మహారాణివి కావలసిన యోగమున్నప్పుడు ఆ యోగాని కెట్లెదురీదగలవు?”

25