పుట:Bhaarata arthashaastramu (1958).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని యది సాధ్యంబుగాదు. ఇంతటియోర్పు ముందు జాగ్రత్తయు మనవారి కున్నదని నమ్ముట సాహసకార్యము.

కొండలు

కొండలు నీళ్ళక్కడక్కడ నిలిచి చెఱువులుగా నేర్పడుటకును నదులు పుట్టుటకును మేఘనిరోధమొనర్చి వానలు గురిపించుటకును ఱాళ్ళు దొరుకుటకును అనుకూలములు. దక్షిణదిక్కునుండి ఉత్తరముగా బోవు మేఘమాలలు నడ్డగించి నీరు వెలిగ్రక్కజేయు హిమాలయ మహాపర్వత పజ్త్కియే లేకయుండెనేని హిందూదేశమున వర్షమును నదులును అవతరించియుండవు. ఈ దేశమున కంతయు నేడుగడవంటిది గాన నది రక్షకులగు దేవతల కునికిపట్టనియు గైలాసంబనియు నెన్నబడియె గాబోలు! హిమవంతంబుననుండు మంచు కరగి నదులను నిండించును గాన గంగాప్రాంతమున నుండువారలు వానలు లేకున్నను క్షామపీడితులుగారు.

ఉన్నతములైన పర్వతములు సదా చల్లగానుండును గాన వేసవిని తాపపరిహారార్థము దేహారోగ్యమునకునై ధనికులును అనారోగ్యముచే గృశించినవారును నీలగిరి ఉదకమండలము మొదలగు స్థలములకుబోయి కొన్నిమాసములు ప్రతియేడునను నివసింతురు. శీతము దార్ఢ్యము గలిగించునది గాన నీలాటి యుపాయములచే యూరోపియనులు తమ నైజశక్తిని తఱుగనీయక కాపాడుకొను చుందురు. ఆచారగ్రస్తులై అనాయాసముగ బ్రయాణముచేయ శక్తులుగానందున మనపూర్వులు ఎండదెబ్బకు శుష్కించినవారై దినక్రమేణ క్షయించిరని తోచెడిని. వారిసంతతివారైన మనము ఉష్ణస్థితి యను ప్రమాదమొకటి చాలక అతిబాల్యవివాహము దగ్గరసంబంధము మొదలగు నికృష్టవర్తనల నవలంబించి ఇంకను హీనదశకు వచ్చియుండుట యెల్లరకును విదితమే.