పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 14

కర -- మీరు వూరికేనన్ను స్తుతిచేస్తూవున్నారు. ఈవెంకడు నాకంటెనూ యెక్కువ అబద్ధాలు ఆడుతాడు. వీణ్ని పంపండి.

రామా -- వీడయితే అబద్ధాలాడుతాడుకాని నీకుమల్లె కమ్మేటట్టుగా చెప్పలేడు. నీవు అబద్ధమాడినా నిజంకంటెనూ దివ్యంగా వుంటుంది.

కర -- అవునుగానండి-

రామా -- అవునూలేదు కాదూలేదు. మీరుయిద్దరూకూడా తక్షణంపొండి. (అని కన్నులెఱ్ఱచేసి కోపపడి కేకలువేయుచున్నాడు)

వెంక -- నేను వెళుతూవున్నాను. (అని పోవుచున్నాడు)

కర -- (తనలో) నేను కార్యం చెడకొట్టకపోయినా రెడ్డిని కాను. నీవయితే నేను వెళ్ళిపోతాను. కులకవలెనని సంతోషిస్తూ వున్నావుకాని - (అని వెళ్లుచున్నాఁడు)

రామా -- నీవంటి చక్కనిది భూలోకంలోలేదు.

మోహి -- అయ్యా! మీస్తుతికి నేను తగినదాన్ని కాను.

రామా -- ప్రియురాలా! నేను సెప్పినది వాస్తవముకాని స్తుతి కాదు. నీబుగ్గలొక్కసారి ముద్దు పెట్టుకోనిస్తావా?

కర -- (మరల ప్రవేశించి తొందరచేత చేతిలోని తమలపాకులపళ్లెము క్రిందపడవేయుచున్నాఁడు)

రామా -- ఓరి నిర్భాగ్యుడా! ఈచిన్నదాన్ని నిష్కారణముగా బెదరకొట్టినావు. పళ్లెము చప్పుడువిని వులికిపడి జడుసుకున్నది.

కర -- అయ్యా - మీరుముద్దు - కాదుకాదు - నేనుపళ్ళెము -

రామా -- (మిఠాయిపొట్లమువిప్పి, ఉండలు మోహినిచేతిలో పెట్టుచు) మోహినీ! కూరుచో - ఓరినిర్భాగ్యుడా! నిన్నుపోయి మోహినితల్లితో వర్తమానం చెప్పిరమ్మంటే మళ్ళీవచ్చినా వేమి? నీవుబుద్ధిపూర్వకంగానే పళ్ళెంపడవేసినావు.