తొమ్మిదవ ప్రకరణము
సహజరక్షణశక్తి
సూక్ష్మజీవులు మన కపకారముచేయకుండ నెల్లప్పుడును మనలను కాయుచుండు ప్రాకరము లనేకములు గలవని చెప్పవచ్చును. అందు మన చర్మము మొదటి ప్రాకారము. గాయము లేనంత కాలము సూక్ష్మజీవులు చర్మముగుండ మన రక్తములోనికి వెలుపలినుండి ప్రవేశింపనేరవు. కాని కొన్ని సూక్ష్మజీవులను చర్మముమీదపెట్టి గట్టిగా రుద్దినయెడల నా సూక్ష్మజీవులు చర్మముగుండ లోపలికి పోగలవు. లోపల ప్రవేశింపగానే యీ సూక్ష్మజీవులు మన గజ్జలు చంకలు మొదలగు స్థలములలో నుండు గ్రంధులచే నాపివేయబడును. ఇవి రెండవవరుస ప్రాకారములోని కోట బురుజులని చెప్పవచ్చును. ఈ గ్రంధులు సూక్ష్మజీవులును ఖయిదీలుగా పట్టి యుంచు స్థలములు. ఇక్కడ మన సైన్యములగు తెల్లకణములు ఈ సూక్ష్మజీవుల నెదిర్చి పోరాడును. వీనిని గెల్చిన పిమ్మటగాని సూక్ష్మజీవులు మన రక్తములోనికి పోజాలవు. ఒక్కొకచో నిక్కడనే యిరుతెగలవారికి ఘోరయుద్ధమై చీము ఏర్పడి గడ్డగా తేలును. సుఖవ్యాధులలో నీ గ్రంధులు పెద్ద వైనప్పుడు వానిని అడ్డగర్రలనియు బిళ్లలనియు చెప్పుదురు.