పుట:AntuVyadhulu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

రెండవ ప్రకరణము

తవుడు దొరుకునా ఏమియు లేదే, యెందుకిది వట్టిశ్రమపడుచున్న’దని తోచవచ్చును. ఒక్కపెంట మీద ఎన్నిదినములైనను ఇది పొట్ట పోసికొనగలదు. ఇది మన్నుతినదని మనకందరకు తెలియును. ఇది మనకంటికి కానరాని పురుగులని ఏరి తినును. దీనినిబట్టి మన కండ్లకంటె దాని కండ్లు మిక్కిలి తీక్ష్ణమైనవని మనకు తెలియగలదు. కావున మన కంటికి తెలియక, మనము మిక్కిలి శుభ్రముగా నున్నదని గర్వించుచున్న ఇంటిలో మనకుకానరాని సూక్ష్మజీవు లనేకములు మన చుట్టునున్నవని కోడినిచూచియు, ఈగను చూచియు, తెలిసికొని, ఈగలకు కోళ్లకుతగిన ఆహారము మన ఇండ్లలో చిక్కకుండ మనము కాపాడుకొనవలెను. ఈ యీగలే యొక ఇంటియొక్క శుభ్రతను కొలుచు పరిమాణములని పైని వ్రాసి యున్నాము. మీ ఇంటిలో ఈగలు ముసురుచున్నయెడల ఎక్కడనో మయిలయున్నది నిశ్చయముగా తెలిసికొనుము. వెంటనే శోధించి స్థలమును కనిపెట్టుము. నివారింపుము. ఈగ లన్నియు నశించిన యెడల అప్పుడు మీయింట సూక్ష్మజీవులు తగ్గి యున్నవని నమ్మవచ్చును.

ఇరుగుపొరుగులు

మీ యిల్లు శుభ్రముగనుంచుకొనినంత మాత్రమున సూక్ష్మజీవులవలని భయములేదనిన ప్రయోజనము లేదు. సూక్ష్మజీవులు మిక్కిలి అల్పమైనవి. గాలిలో నెగిరి పోగలవు.