రెండవ ప్రకరణము.
సూక్ష్మజీవు లెక్కడ నుండును.?
ఈ సూక్ష్మజీవు లెక్కడెక్కడుండునని మీరు అడిగినచో నవి సామాన్యముగా మన శరీరముమీదను, మన పేగుల లోపలను, మన ఇంటిలోపలను, వెలుపలను, గాలియందును, నీటియందును మనము ఎక్కడ శోధించినను అక్కడనుండునని చెప్పవచ్చును. తెలియనివారలకు, అవి యెట్టివియో, వానిని చూచు టెట్లో తెలియకపోవుటచేత అవి కానరావు. ఎక్కడెక్కడ అశుభ్రతయు, క్రుళ్లుచుండు పదార్థములును, హెచ్చుగనుండునో అక్కడ సూక్ష్మజీవు లధికముగ నుండును. మన ఇండ్లలో మన కాళ్లక్రిందపడి దొర్లుచుండు చీమలకును, కల్మషమును తిని బ్రతుకు ఈగలకును తెలిసిన కొన్ని విషయములు మనకు తెలిసినయెడల, ఎంత ప్రశస్తమైన నీళ్లు తెచ్చినను దాని నిండ పురుగులున్నవని మనము చెప్పుదుము. ౧, ౨, ౩ పటములను చూడుము, ఎంత శుభ్రమయిన దుస్తులు తెచ్చినను వానినిండ మైల ఉన్నదని త్రోసివేయుదుము. ఈగ కండ్లు మనము పెట్టుకొని ఇంటిప్రక్కను క్రుళ్లుచుండు ఆవుపేడను ఒక్కసారి చూచినచో ఆరునెలలవరకు మనకు అన్నహితవు చెడిపోవును. ౪-వ పటము చూడుము.