Jump to content

పుట:AntuVyadhulu.djvu/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తడిలేని వేడి

135


కుంచెడు కల్మషపునీళ్లకు, వేయిపాళ్ల నీళ్లకొక పాలుగల సౌవీరపు మందునీళ్లను సోలెడో తవ్వెడో చేర్చుకొనునెడల పది వేలపాళ్లు కల్మషపు నీళ్లకు ఒక పాలైన సౌవీరముండునో యుండదో సందేహము. కాబట్టి ఇట్టిమందుల నుపయోగింపుచున్నప్పుడు మిక్కిలి బలహీనమగు ద్రావకముల నుపయోగింపక తీవ్రమయిన గుణముగల పదార్థములనే ఉపయోగింపవలెను. ఎట్లనగా ఒక శేరు కల్మషపునీళ్లకు 10 శేరుల సౌవీరము చేర్చినయెడల రమారమి వేయింటి కొకపాలు సౌవీరము చేర్చినట్లగును. కాని అప్పటికప్పుడు చూర్ణముచేసినను సౌవీరమును కల్మషపు నీళ్లలో చక్కగ కరుగునట్లు కలుపుటకు తగిన అవకాశమును, అనుకూలమును నుండదు. కావున అంతకు ముందే నూటి కొకపాలుచొప్పున నీళ్లలో సౌవీరమునుకలిపి ద్రావకముగాచేసి నిలవయుంచుకొని ఆ ద్రావకమును శేరు కల్మషపు నీళ్లకు అరసోలెడు కలిపిన రమారమి వేయింటికి ఒకపాలు సౌవీరము చేరియుండును. ఇప్పుడు మందు చక్కగ కలసి మూలమూలలనుండు సూక్ష్మజీవులను చంపునట్లు కల్మష పదార్థమును దేనితోనైనను కలగబెట్టవలెను. తగినంత పలచగ నుండని యెడల నీళ్లు పోయవలెను.

తడిలేని వేడి (Dry heat)

అనగా నీటియావిరిలేని వేడిగాలి: సూక్ష్మజీవులను చంపు శక్తులలో వేడి మిక్కిలి ఉపయోగ కరమైనది. 100[1]


  1. నూరు డిగ్రీల వేడి యనగా సల సల కాగు నీటియొక్క వేడి.