పదమూడవ ప్రకరణము
సూక్ష్మజీవులను వెదకివెదకి చంపుట
ఏ పదార్థము నందైనను సూక్ష్మజీవులు లేకుండజేసి కొనుటకే శుద్ధిచేసికొనుటయని చెప్పుదురు. సూక్ష్మజీవులెక్క డెక్కడయుండునో పైని చూపియున్నాము. ఇపుడు వానిని నశింపజేయు సాధనములందెలిసి కొనవలయును. ఇట్టిసాధనము లనేకములు కలవుకాని, యందుగొన్ని సూక్ష్మజీవులను చంపగలిగినను మనకు కూడ హానికలుగజేయును. ఒక బట్టను సూక్ష్మజీవులంటి యున్నపుడు ఆబట్టను నిప్పులోగాని, గంధకధృతిలోగాని వేసినయెడల సూక్ష్మజీవులు నశించిపోవును, బట్టయు నాశమగును. ఇట్టిపద్ధతివలన మనకేమి ప్రయోజనము? కాబట్టి, మన శరీరమునకుగాని వస్తువులకుగాని చెరుపుగలుగ జేయక యేపద్ధతులు సూక్ష్మజీవులను చంపునో యవి మన కుపయుక్తములు; అందును ఎవ్వి త్వరలో పనిచేయునో ఎవ్వి చవుకగను సులభముగను లభించునో వానిని మనము తరచుగనుపయోగ పరచవలెను. ఇట్టి పద్ధతులలో మూడు విధములుగలవు.
i. దుర్వాసనను మాత్రమే పోగొట్టునవి.
ii. సూక్ష్మజీవుల యభివృద్ధినిమాత్రము మాన్పగలిగి వానిని జంపుటకుకంతగాశక్తిలేనివి.
iii. సూక్ష్మజీవుల రూఢిగ జంపునవి.