పదియవ ప్రకరణము
కల్పితరక్షణశక్తి
ఒక్కొక్క వ్యాధి యొక్కొక సారి వచ్చి పోయిన తరువాత తిరిగి ఈ వ్యాధి మనల నంటదని మశూచకము, ఆటలమ్మ మొదలగు కొన్ని వ్యాధులను చూచి మనము తెలసికొనియున్నాము. ఇట్టి రక్షణశక్తి పుట్టుకలో మనకు సహజముగ వచ్చినదికాదు. కావున నిది కల్పితరక్షణశక్తియే యగును. ఇదిగాక టీకాలు మొదలగు సాధనములవలన మనమిప్పుడు కొన్ని వ్యాధులు మన కంటుకొనకుండ జేసికొనుచున్నాము. ఇట్టి రక్షణశక్తియు కల్పితరక్షణశక్తియే. కొన్ని వ్యాధులు తగిలి కుదిరినతరువాత నవి తిరిగి యంటవను విధి లేదు. పచ్చసెగ, న్యూమోనియా యను జ్వరము, సర్పి, చలిజ్వరము మొదలగునవి యీ జాతిలోనివని జ్ఞప్తి యుంచు కొనవలేను.
కల్పితరక్షణశక్తియందు తిరిగి రెండు విధములు కలవు. కొన్ని వ్యాధులలో రక్షణ శక్తి కలిగించు పదార్థములను మన శరీరమునందే పుట్టించి వాని మూలమున మనకు రక్షణ శక్తి కలిగింపవచ్చును. దీనికి శరీరజనిత రక్షణశక్తి (Isopathic or Active) యని పేరు. మరికొన్ని వ్యాధులలో నీపదార్థ