పుట:Andrulasangikach025988mbp.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(పంబకాడు=కొమ్ముపట్టుమాల, కల్జు, రుంజకాడు=బవనీడు అనుమాల, పరజాల అన నేమో తెలియదు.)

ఆడిదము సూరకవి కాలమువరకే పూర్వాచారాలు మాసిపోవుచు వచ్చెనని కవి యిట్లు వాపోయినాడు.

          అగ్రహారములు నామావశిష్టములయ్యె
          మాన్యంబులన్నియు మంటగలిసె
          భత్యంబునకు దొంటి పడికట్టుతప్పెను.
          బుధజనంబుల రాకపోకలుడిగె
          వర్షాశనంబులు వరదపాలై పోయె
          మలవతీలను ప్రజల్ మాసిచనిరి
          నశించిపోయె వంటరులు తురుష్కులు
          గజతురంగములు తాకట్టుపడియె
          ధార్మిక స్థానమున కిట్టి తళ్ళుబుట్టె
          కఠిన చిత్తుని రాజ్యాధికారి జేసి
          యింత పీడించితివి సత్కవీంద్రకోటి॥
రా॥

క్రీ.శ. 1600 నుండి ఆంధ్రులు రాజకీయ పతన మయ్యెనని చెప్పవచ్చును. దక్షిణములో రఘునాథ రాయలకాలములో (1614-1633) తంజావూరులో ఆంధ్రులగొప్పదనము నిలిచియుండెను. ఆతని కాలములో తెనుగువారిపై మహమ్మదీయుల అక్రమములుకాని, యుద్ధాలుకాని సాగనేరక పోయెను. వారిని రఘునాథుడు ఓడించి ఆంధ్రుల సృష్టిని (Culture) మరికొంత కాలము నిలిపెను.

అతని కాలములో దక్షిణమున తెనుగు యక్షగానాలు చాలా వృద్ధికి వచ్చెను. నాటకాలు, నాట్యకళ, సంగీతకళ ప్రశస్తి కెక్కెను. ఇతర ప్రాంతాలలో తెలుగువారు తమ పూర్వులు నిర్మించిన శిల్పాలను కోలుపోయిరి. కాని తంజావూరులో ప్రాతవి నిలుపుటయేకాక రఘునాథ రాయలు చక్కని శిల్ప సౌందర్యముకల దేవాలయాలను, రాజభవనాలను, కోటలను నిర్మింపజేసెను. అతడు సంగీత విద్యానిధి. అత డొక క్రొత్త వీణను కనిపెట్టెను. దానిపేరు రఘునాథ మేళ. ఆంధ్ర సరస్వతి ముత్యాల శాలలో అచ్చట నాట్యమాడెను. ఈ విధముగా సంగీతాలు, కవిత్వాలు, శిల్పము తంజావూరులో వృద్ధిపొందెను.