పుట:Andhrulacharitramu-part3.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిల్లీ చక్రవర్తి ప్రభుత్వము నశించి పోయెనుగాని ప్రతాపరుద్రుని పుత్త్రునికి మాత్ర మీయోరుగల్లు రాజ్యము స్థిరపడక స్వల్పకాలములోనే యన్యాక్రాంత మయ్యెను.

రేచెర్ల సింగమనాయని విజృంభణము

[1]రేచెర్ల సింగమనాయడు రాచకొండదుర్గములో నుండి యేకశిలానగరమునకును శ్రీశైలమునకు నడిమిదేశమును బరిపాలనము చేయుచుండెనని ఇంతకు బూర్వము దెలిపి యున్నాడను. ఇతడు బలాఢ్యములగు రాచకొండ, దేవరకొండ దుర్గములలో నివసించుచు గాకతీయున్వయుల యధికారమును ధిక్కరించి స్వతంత్రుడై రెడ్డినాయకులకు రాచవారికి బ్రబల శత్రువై వారిగిరి దుర్గములనాక్రమించుకొనుచు భయంకరుడై యుండెను.

  1. ఇతడు ప్రతాపరుద్రుని ప్రసిద్ధ సేనానులలో నొక్కడైన యెఱ్ఱనాచానాయని పుత్త్రులలో జ్యేష్ఠుడు. ప్రతాపరుద్రుని పరిపాలన కాలమున మగతల యనుగ్రామమువొద్ద మచ్చకొమ్మనాయడను వానిని జిలుగుపల్లియొద్ద రుద్రమనాయని యుద్ధములో సంహరించి రణము గడిపి మచ్చనాయకగండ యను బిరుదమును, సామంతరాగోల యను బిరుదమును, కొదమనాయకతలగుండుగండ యను బిరుదమును ప్రతాపరుద్రునివలన బొందుటయె గాక యెనుబది వరముల నాతని వలన బడయగాంచి అశీతనరాలసింగమనాయ డని ప్రసిద్ధి గాంచెనటి - వెలుగోటి వారి వంశచరిత్ర పేజీ చూడుడు.