పుట:Andhrula Charitramu Part-1.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నామెకు పుత్రుడుగలిగెను. ఆ వెంటనే ఆకాశవాణి "వీడొక ప్రమథునియవతారము, బ్రాహ్మణుడు; వీని పేరు గుణాఢ్యుడు"అని పలికెను. నేనే ఆ గుణాఢ్యుడను. పిమ్మట కొంతకాలమునకు నా తల్లియు మామలును శాపవిముక్తులై దేహత్యాగము చేసిరి. తరువాత నేను బాల్యావస్థలోనుండియు ధైర్యము తెచ్చుకొని విద్యార్థినై దక్షిణాపథమునకు పోయి క్రమముగానచ్చట సర్వవిద్యలను నేచ్చుకొని ప్రసిద్ధిగాంచి స్వదేశమునకు వచ్చితిని. ఒకనాడు నేను దేవేంద్రభవనము వంటిదైన రాజభవనమునకు పోయితిని. శిష్యులచేత ముందు వర్తమానము పంపి యనుజ్ఞబడసి లోపలికిబోయి ఆస్థానమునందు దేవతలచేత నింద్రుడునుంబోలె శర్వవర్మాదులచే పరివృతుడై రత్నసింహాసనాసీనుడైయున్న సాతవాహన[1]మహారాజును దర్శించితిని. వానినాశీర్వదించి యుచితాసనమున గూరుచుంటిని. అర్హవిధానమున రాజును నన్ను గౌరవించెను. అప్పుడు శర్వవర్మాదులు సాతవాహనునితో "దేవా! ఈతడు సకలవిద్యా విశారదుడు; లోకమంతట ప్రసిద్ధికెక్కినవాడు, అందుచేతనే యీ మహాత్మునికి గుణాఢ్యుడను పేరు సార్థకమైనది" అని విన్నవించి నన్ను పొగడిరి. అంతట సాతవాహనుడు ప్రీతుడై అప్పుడే నన్ను సత్కరించి మంత్రినిగా నియమించెను. అది మొదలుకొని నేను రాచకార్యములు విచారించుచు శిష్యులకు పాఠములు చెప్పుచు వివాహము చేసికొని సుఖముగానుంటిని. అని చెప్పగా కాణభూతి సాతవాహనుని కాపేరెట్లు గలిగెనో చెప్పుమనియడిగెను. గుణాఢ్యుడిట్లు చెప్పదొడంగెను.

సాతవాహనుని వృత్తాంతము.

దీపకర్ణియను రాజు దక్షిణాపథమును బాలించుచుండెను. వానికి ప్రాణప్రియయైశక్తిమతియని భార్యయుండెను. ఆమె యొకరాత్రి సుఖశయ్యను నిద్రించియుండగా పాము కఱచెను. అందుచేత నామె మరణమునొందెను. అంతట దీపకర్ణి శోకముచేత నపుత్రకుడయ్యును బ్రహ్మచర్యవ్రత మవలంబిం

  1. శాతవాహనుడని శాసనములలో వ్రాయబడియుండగా సాతవాహనుడని కథాసరిత్సాగరమున వ్రాయబడినది.