పుట:Andhraveerulupar025903mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయలు.

మహా శూరశిఖామణియు ఆంధ్రభాషాప్రియుడు నగు శ్రీకృష్ణదేవరాయల దివ్యనామము నెఱుంగని యాంధ్రుడుండడు. ఈ రాజతిలకుని జీవితచరిత్రము చెప్పుటకు ముందు విద్యానగర సామ్రాజ్య చరిత్ర మించుక చెప్పవలసియున్నది.

ప్రతాపరుద్రదేవుడు బంధీకృతుడైనంతన సేనానాయకు లెవరిత్రోవను వారేగి చిన్నచిన్న రాజ్యములను స్థాపించిరి. ఆంధ్రనగరమున సుగంధ భాండాగారాధ్యక్షులుగా నున్న హరిహరరాయలు, బుక్కరాయలు, మాధవ మంత్రితో గలిసి యానెగొంది ప్రాంతములకు జనుదెంచిరి. శైలములమధ్య సురక్షితముగానున్న యొక ప్రదేశమునందు శా.శ. 1648 ధాతసంవత్సర వైశాఖశుద్ధ పంచమి (క్రీ.శ.1136) నాడు మాధవమంత్రి విద్యానగరమను పట్టణరాజమును నిర్మించి హరిహరరాయల బ్రభువుగను బుక్కరాయల యువరాజుగ నొనరించెను. నగరముచుట్టును ఏడు ప్రాకారములు నెలకొల్పబడెను. మాధవమంత్రి సన్యసించి మాధవ విద్యారణ్యు లను నామముతో శృంగేరి పీఠమున కధ్యక్షుడయ్యెను. క్రమక్రమముగా విద్యానగరరాజ్యము మిగులవృద్ధిలోనికి వచ్చి సుప్రసిద్ధమై యరిజనాభేధ్యమై యొప్పెను.