చాలదని తనమంత్రిని సైన్యమును వెంటగొని యొకమాఱు విజయయాత్రకు వెడలి పలువురు స్వతంత్రరాజులను సామంతులుగా గొని కొన్నిచోటుల జయస్తంభముల స్థాపించి నియమిత కాలమునకు రాజధాని చేరెను. ఓరుగల్లు నగరము మిక్కిలి రమణీయముగా నలంకరింప బడెను. స్వయంభూదేవాలయము నందును, జెన్న కేశవాలయము నందును మహోత్సవములు జరుప బడెను. జరుపబడిన వేడుకలకు మితములేదు. మంగళవాద్యములచే భూనభోంతరములు మాఱుమ్రోగెను. వివిధ ప్రాంతములతో బుణ్యనదులనుండి తెచ్చిన శుద్ధోదకముచే బ్రతాపరుద్రచక్రవర్తిని బట్టాభిషిక్తుని గావించిరి. ప్రజల యుత్సాహము మేరమీఱెను. రుద్రమదేవి యాశుభావపరము బురస్కరించుకొని యుద్యోగులందఱకు సత్కృతు లొనరించెను.
ప్రతాపరుద్రుడు రాజ్యమునకు వచ్చిన క్రొత్తలో గొంద ఱాతని నిరాకరించి కప్పములొసంగుట మానిరి. కొందఱు స్వాతంత్ర్య సంపాదమునకు గుట్రలు చేయసాగిరి. మనుమగండగోపాలుడు, అంబయదేవమహారాజు, త్రిపురారి దేవుడులోనగు నెల్లూరు మండలపాలకులు తిరుగబడిరి. ప్రతాపరుద్రుడు తనసైన్యమునంపి మనుమగండ గోపాలుని దెగటార్పించి రాజ్యమున శాంతి స్థాపింప జేసెను. అంబయ దేవ త్రిపురారి దేవాదులు తమంతతాము లోబడిరి. ప్రతాపరుద్రుడు స్వాతంత్ర్యము ప్రకటించుటకు యత్నించుచున్న పాండ్య చోళ