అనపోతు అందఱికంటె ముందె మరణించెను. బ్రతికి లాభము లేదని బాలుడు తెగబడి చిక్కినవైరిని జిక్కినటుల నఱకు చుండెను. విరోధులందఱు బాలుని మేనినిండ బాణములను నించిరి. బాలునకు బ్రతుకుమీద నాశతీరెను. బాలచంద్రుడు తన మిత్రులందఱకు గన్నీటితో దర్పణాదులొసంగి అలుగుల నేలబ్రాతి తనమిత్రుల నెత్తుటిలో దడిపిన యక్షతలతో నాయలుగులకు బూజజేసి కనులు మూసికొని వానిపై నొరిగి మరణించెను. బాలునిమరణమున కుభయసైన్యములందు హాహాకారములు పెచ్చరిల్లెను.
బాలుని మరణవార్త విని మంచాల చిచ్చురికెను. బాలుని భౌతిక దేహము నీవిధముగా మహారణమధ్యమున బడి నశించెను. అతనియస్తికల గంగధారలోగలిపిరి. ఈకథ జరిగి యిప్పటికి దాదాపు ఎనిమిదివందల సవత్సరములు జరిగినను, మనము బాలచంద్రుని మఱచిపోవలేదు. కవులా-వీరుని జీవితమును వీరగేయములుగా వ్రాసిరి. శిల్పులా-వీరమూర్తి యాకృతి శిలలపై జెక్కిరి. వీరులా-బాలుని యాదర్శముగా గైకొనిరి. నేటికి బాలదాసరుల పూజయని బాలచంద్రుని యొక్కయు, నతని సోదరులు మిత్రులగు నితర బాలురయొక్కయు పూజ మనము చేయుచున్నారము. ఆంధ్ర బాలకవర్గమునకు త్యాగధనుడగు బాలచంద్రుని జీవితము ఆదర్శప్రాయమగుటకు భగవంతు డనుగ్రహించుగాత.
- _______