పుట:Andhraveerulupar025903mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. బాలచంద్రుడు.

వీరకుమారుడు బాలచంద్రుడు భారతవీరులలో సుప్రసిద్ధుడగు అభిమన్యునితో బోల్పదగినవాడు. ఈవీర బాలుని జీవితము జెప్పుటకు ముందు బూర్వకథ కొంచెము చెప్పుటయవసరము. మన కథా కాలమునకు గొంచెముముందు గురిజాల రాజధానిగ జేసికొని అనుగురాజు పల్నాటి రాజ్యమును బరిపాలించుచుండెను. అనుగురాజునకు ముగ్గురుభార్యలు. వీరవిద్యాదేవి, భూరమాదేవి, మైలమాదేవియని వారిపేరులు. భూరమాదేవియందు కామరాజు, నరసింహరాజు, జెట్టిరాజు, పెరుమాళ్ళురాజు అను నలుగురు కుమారులు. వీరవిద్యాదేవి యందు పెదమల్లదేవుడు, పినమల్లదేవుడు, బాలమల్ల దేవుడు అను మువ్వురు తనయు లుద్భవించిరి. వీరందరి కంటె మైలమాదేవి కుమారుడగు నలగామరాజు పెద్దవాడు. అనుగురాజు తన యంత్యకాలమునందు రాజ్యమును దనకుమారులను రేచర్లగోత్రుడును వెలమవీరుడు నగు శీలము బ్రహ్మానాయని చేతబెట్టి కుమారుల నుద్ధరించి రాజ్య తంత్రములను మంత్రివై నిర్వహింపుమని చెప్పి ప్రాణములు విడిచెను. బ్రహ్మనాయడు మృతభూపులకు క్షత్రియవంశాచారానుగుణముగా నుత్తరక్రియ లాచరించి కుమారులపక్షమున రాజ్యచక్రము తానె జయప్రదముగా ద్రిప్పుచుండెను.