పుట:Andhra bhasha charitramu part 1.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

అన్ని దేశములలోను జనులందఱును నొక్కటే భాష నెందుకు మాట్లాడరు ? శబ్దములు మొట్టమొదట నె ట్లుత్పత్తి నొందినవి ? మాటకును నది తెలియజేయు వస్తువునకును గల సంబంధమేమి ? ఒక మనుష్యునికిగాని, ఒక వస్తువునకుగాని, యున్న పేరే యేల యుండవలెను ? మఱియొక పే రెందుకు లేదు ? - ఇట్ట్లి ప్రశ్నలు మనుష్యులు తమ భాషనుగుఱించి యాలోచింప మొదలుపెట్టిన నాటనుండియు కలుగుచునే యున్నవి. పూర్వకాలమున నిట్టి ప్రశ్నలకు సమాధానములు మతమునకు సంబంధించి యుండెడివి. దైవమో, ఏదో యొక పేరుగల దేవుడో భాషను సృజించినాడనియో, లేదా, దేవుడు జంతువులన్నిటిని మొట్టమొదట సృష్టినందిన పురుషునియొద్దకు తీసికొనిపోగా, ఆ మనుష్యుడు వానికి పేళ్లుపెట్టినా డనియో, సమాధానము చెప్పుచుండెడివారు. మనుష్యుడు చేసిన పాపములకును, నతని యహంభావమునకును దండనముగా మనుష్యులభాషలలో ననేకత్వము సంభవించినదని బైబిలుప్రాచీన భాగమునందు తెలుపబడియున్నది. యూదు లిట్టి సామాన్యప్రశ్నములను గూర్చికాక స్వయంవ్యక్తములు కాని కొన్ని సంజ్ఞావాచకశబ్దముల లను గూర్చి విచారించుచుండెడివారు.

గ్రీకు వైయాకరణులుకూడ నిట్టి వ్యుత్పత్తులనుగూర్చియే వాదములు చేయుచుండిరి. కాని, వారి వ్యుత్పత్తులు శాస్త్రీయములుకాక, ధ్వనిసామ్యము ననుసరించి యుండెను. ఊహచేత కిట్టించిన వ్యుత్పత్తులతో వారు తృప్తిపడుచుండెడివారు. అయినను, వా రిట్టి స్వల్పవిషయములనేకాక, మాటలు తాము తెలియజేయు భావములకు స్వాభావికములును, ఆవశ్యకములును నయిన చిహ్నములా ? లేక; సాంకేతికములును, ఇచ్ఛాధీనముగ నేర్పరుపబడినవియు నయిన గుఱుతులా ? ఆయా భావముల కాయామాటలనేకాని, ఇతర శబ్దముల నుపయోగింప వీలులేదా?-అనునిట్టి సామాన్య విషయములనుగుఱించి కూడ నెక్కువగా వాదములు చేసియుండిరి. ప్లేటో వ్రాసిన "క్రేటిలాన్" అను గ్రంథమువంటి గ్రంథములలో నిట్టి యనంతములయిన వాదములు కనబడుచున్నవి. వీని కొకదారియు నొకతెన్నును నుండదు; సిద్ధాంతము తేలదు. వారి వాదమున కాధారము తమ గ్రీకుభాష మాత్రమే యగుటచేత నొక సిద్ధాంతమును తేల్చుటకు వీలు లేకపోయునది. ఇట్టివాదములే చాలకాలమువఱకును జరిగినవి. పరస్పర సామ్యభాషాశాస్త్రమును గుఱించి (comparative Philo-