Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృత కృతులు:- 1. గుణశ్లోకాది చిత్రరచన 2.కవితా వినోద కోశము 3.సీతా నేతృస్తుతి 4. కాశీశ్వరాష్టకము 5. మంగశాష్టక చతుష్టయము 6. శ్రీ వేంకటగిరి ప్రభు ద్వ్యర్థిశ్లోక కదంబము ఇత్యాదికము.

పార్వతీశ్వరశాస్త్రిగా రభిన వాంధ్రకవితా పితామహుడని పేరు చెందిన పండితుడు. ఈయనకు బ్రబంధకవిత్వమందును శతక కవిత్వమందును బెద్దమమకారము. శతకకవులలో నీయన కున్నది యుత్తమస్థానము. వీరు వ్రాసినశతకములు శతసంఖ్యగలవి. సత్యవోలు భగవత్కవి మున్నగు వారు శతకశతము రచించినట్లు తెలియుచున్నది. తెలుగు వాజ్మయమున శతకములకు గొప్ప విలువయున్నది. అది యిప్పుడిప్పుడీ యిరువదవ శతాబ్దినుండి యించుక సన్నగిల్లుచున్నది. నేడును 'కాళహస్తీశ్వర' ప్రభృతి శతకములను గౌరవముతో జూచు చున్నవారు చాలమందియున్నారు. పార్వతీశ్వరకవి 19 వ శతాబ్దిలో బ్రసిద్ధుడగు శతకకవి. కేవలము శతక కవియేకాదు. ఆశుకవి, ప్రబంధకవి కూడను. వీరినిగూర్చి చెప్పవలసిన విశేషములు చాలగలవు.

ఈయన పితామహుడు పేరయసూరి. ఇందుమతీపరిణయము, నిర్దుష్ట నిరోష్ఠ్యదాశరథీశతకము, లక్ష్మీనృసింహమూర్తిస్తుతి కృతులు రచించిన వారు వీరే. పార్వతీశ్వరశాస్త్రిగారితండ్రి కామకవి బ్రహ్మోత్తరఖండము, కార్తికమాసవ్రతమహాత్మ్యము, బలరామక్షేత్రమహత్త్వము, జానకీరామ శతకము, సూర్యనారాయణ రామప్రభుశతకములు రచించిన విద్వత్కవి. పార్వతీశ్వరకవి యన్నగారు రామస్వామిశాస్త్రి వేదాంతకృతి కదంబము, గంగాలహరి, గంగాస్తవము వ్రాసిరి. పార్వతీశ్వరశాస్త్రిగారు తండ్రిగారి సన్నిధని మొదట జదువుకొనిరి. తరువాత తాతా సూర్యనారాయణశాస్త్రిగారి కడ బఠించిరి. శ్రీ త్రైవదేంద్రస్వామివారి యనుగ్రహమున నుపనిష త్పాఠము చేసిరి. స్వయంకృషిచే బలమైన పాండిత్యము సంస్కృతాంధ్రములలో సంపాదించిరి. కవిత్వము సహజముగ నున్నదే.