పుట:AndhraRachaitaluVol1.djvu/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వడ్డెపాటి నిరంజన శాస్త్రి

1877 - 1937

స్వర్ణకారవంశీయుడు. తల్లి: భద్రమ్మ. తండ్రి: కోటయ్య. జన్మస్థానము: తెనాలి తాలూకాలోని దుగ్గిరాల. జననము: 14-10-1877, ఈశ్వర సంవత్సరాశ్వయుజ శుక్లాష్టమి భానువాసరము. నిర్యాణము: 17-10-1937 సం. ఈశ్వర సంవత్సరాశ్వయుజ శుక్ల త్రయోదశీ భానువాసరము. ప్రకటిత గ్రంథములు: 1. కల్యంధకౌముది (కావ్యము) 2. కుమారాభ్యుదయము (కావ్యము) 3. బ్రహ్మానందలీలలు (ఎనిమిదంకముల నాటకము 1937 ముద్రి.) ఆముద్రితములు: 1. ధర్మపాల చరితము. 2. భీష్మోదయము. 3. మాఘమాహాత్మ్యము. 4. సూర్యశతకము. 'శ్రీ నిరంజన విజయము ' కొండూరి వీరరాఘవాచార్యులు రచించినది చూడవచ్చును.

వడ్డెపాటి వారిది విశ్వబ్రాహ్మణవంశము. ఆవంశమున బుట్టిన నిరంజనశాస్త్రి తండ్రి కోటయ్య యనునతడు కమ్మరీడు. అతడు కులోచితమగు కమ్మరముచేసికొనుచు స్మార్తము గురుముఖమున నధ్యయనము చేసినవాడు. ధనసంపత్తి విషయములో నతనికుటుంబము సామాన్యమైనది. నిరంజనశాస్త్రి తండ్రికడనే పసితనమున జదువుకొని, యుపనీతుడైన పిమ్మట వేదాధ్యయనమున కుపక్రమించెను. వేదము పాఠము చేయుచునే జ్యోతిశ్శాస్త్రమును గేరళమును సొంతముగ జదువుకొని, తెలియనిది తజ్‌జ్ఞలవలన దెలిసికొనుచుండెను. 'బంగారవంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగి' నటులు కాకుండ గులవృత్తి యగు కమ్మరమునుగూడ నిరంజనశాస్త్రి వీలుకలిగినపుడెల్ల నలవాటు చేసికొను చుండెను. క్రమముగ వయసు వచ్చుచున్నకొలది సంస్కృతవిద్యపై నభిలాషము పెరిగి నిరంజనశాస్త్రి పండితుల దరికేగి కావ్యములు, నాటకములు, కొన్ని యలంకారగ్రంథములు బహుశ్రద్ధగ జదువుకొని, ఆ సాహిత్యమునకు మెఱుగుపెట్టు కొంచెము వ్యాకరణపరిచయము కలి