పుట:AndhraRachaitaluVol1.djvu/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నడచినవి. చిలకమర్తికవి దట్టిదికాదు. మార్దపము తప్పని హాస్యముతో నీలక్ష్మీనరసింహకవి యెనుబదిమూడు ప్రహసనములు వ్రాసి ప్రకటించెను. జయంతి రామయ్యపంతులుగారు చెప్పినట్లు "వీరేశలింగముగారి హాస్యము చిక్కనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము పలుచనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము గిలిగింతలు పెట్టి నవ్వించును. వీరేశలింగముగారి హాస్యము గిల్లి బాధించును."


లక్ష్మీనరసింహముగారి "గ్రంథప్రకటనము" అను ప్రహసనమునుండి వారి హాస్యరచనకు గొన్ని పంక్తు లుదాహరించెద. "వెక్కిరింతల వెంగళప్ప" తాను రచించిన "వెఱ్ఱిపప్పీయ" మను గ్రంథముయొక్క ఔత్కృష్ట్యము ప్రకటించుచు నాగ్రంథమునుగూర్చి యిద్దఱుపండితు లిచ్చిన యభిప్రాయములగూడ బ్రకటించినారు. వారిలో మహామహోపాధ్యాయ కొంకనక్క గురులింగశాస్త్రిగా రిట్లు వ్రాసినారు.


"మీ వెఱ్ఱిపప్పీయమ ను నేను సమగ్రముగా జూచితిని. కాళిదాస, భవభూతి, మయూర, వ్యాస, వాల్మీకుల కవిత్వములకంటె నిందలికవిత్వము వేయిరెట్లధికముగా బాగున్నది. ఇందలి పద్యములు గారిముక్కలవలె నెంతో రుచిగా నున్నవి. వీనికి అల్లపుపచ్చడివలె చిన్న వ్యాఖ్యానముకూడ గ్రంథకర్తగారే రచించినందున సర్వజన గ్రాహ్యమైయున్నది. ఇట్టిగ్రంథము జన్మయెత్తి చూచి యెఱుగను. ఇకముందు చూడబోను. ఇంకొకజన్మమునకుగూడ జూడ గలనని నమ్మకములేదు. ఇందలి వీరరసపద్యములు రెండు చదువగానే నా కావేశమెత్తి గొడుగుకామతో నాభార్యను మెత్తగా మర్దించితిని. మీగ్రంథ మందలి పై రెండుపద్యములును నేను చదువుచుండగా దగ్గరనుండి విన్నమా నిళ్ల బ్రాహ్మణుడుకూడ ఆరసము గ్రహించి కావడిబద్ద తిరగవేసి నన్ను వెన్ను పూస బిరుగునట్లు కొట్టెను.కాబట్టి యీగ్రంథము మందఱు కొనదగినది.