పుట:AndhraRachaitaluVol1.djvu/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేద మధ్యయనించి, వేదాంత మభ్యసించి, భాష్యత్రయము పఠించి, సాహిత్యరత్నాకరము చుళుకించి మహోపాధ్యాయు లనిపించుకొనిన మహాశయులు వేంకటరామశాస్త్రిగారు. ఆంధ్రసారస్వతమున వీరి ప్రయోగ పరిజ్ఞాన పాటవము మిక్కిలి గొప్పది. గుప్తార్థప్రకాశికయే యీవ్రాతను నిర్ధారించును. గుప్తార్థప్రకాశిక విషయమై విమర్శకులు వ్రాసిన విమర్శలపై "సమరాంగణ పార్థమూర్తి, ధటా సూర్యప్రదర్శి, కన్నెపల్లి వేంకట సీతారామశాస్త్రి" మున్నగు పేరులతో సమాధాన వ్యాసములు వ్రాసిరి. ఈ రచన లెల్ల శాస్త్రిగారి యసాధారణ ప్రజ్ఞా వైశద్యమును సహస్రముఖముల ఘోషించుచున్నవి. వేంకతరామశాస్త్రి గారిని మించిన పండితు లుండవచ్చును గాని చమత్కారముగా వీరి వలె 'కాని దవు ననియు, నయినది కాదనియు ' శాస్త్ర ప్రామాణ్యము చూపి సమర్థించువా రరుదు. ' సుమనోల్లాస ' శబ్దసమర్థనమున నీశక్తి తెల్లమగును. ఈయన మేధాసంపత్తి యత్యద్భుత మని వీరి ప్రత్యర్థులగు పండితులే శ్లాఘించుచుందురు. వేదాంత మెరిగిన విద్వాంసులయ్యు శాస్త్రిగారు శివాద్వైతులు. ఈశ్వరాస్తిక్య విషయమున వీరి వ్యాసరచన బహుళముగ సాగినది. 1885 మొదలు రాజమహేంద్ద్రవరమున ' టౌన్ స్కూలు ' లో సంస్కృతోపాధ్యాయులై ట్రైనింగు కాలేజీలో సంస్కృత ప్రహానోపదేశకులై, సర్వకళాశాలలో గీర్వాణభాషాగురు పదారూఢులై, కొవ్వూరు సంస్కృత కళాశాలలో బ్రధానదేశికులై, విద్యార్థుల నెందరనో విద్వాంసుల నొనరించిన యాచార్యశేఖరుడీయన. జ్యోతిశ్శాస్త్ర విదులైన నాటి పండితులలో మనశాస్త్రిగారిదే పై చేయి యన్నట్లు ' చతురస్యా ' ది రచనలు చాటుచున్నవి.

వేంకటరామశాస్త్రి చరణుల తెలుగు కవితయు, గీర్వాణ కవితయు మాధురీభరితము.

పరిభాషావిధిశాస్త్రముల్ స్వపదసంబంధైకవాక్యత్వ వై
ఖరితో రంజిలి కార్యకాల మనుపక్షం బందు నున్నట్లు ని
ర్భరరాగమంబున నల్లుకొన్న రసిక ప్రాచీనజాయాపతుల్
వరసౌఖ్యంబిడిప్రోచుతన్ ! దివిని సుబ్రహ్మణ్యు జ్యేష్టాత్మజున్.