పుట:AndhraKavulaCharitamuVol2.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పుట్టున్నీగెద" (పుట్టున్+ఈగెద) మొదలయిన వ్యాకరణ విరుద్ధము లైన ప్రయోగములు మఱి కొన్నియందందు గానవచ్చుచున్నవి. కాబట్టి యీ యాముక్తమాల్యద సర్వలక్షణవేత్త యయిన యల్లసాని పెద్దన విరచితము కాదనుట స్పష్టము. అంతేకాక యీపుస్తకము పెద్దనకవనమువలె మృదువై నదియు, నల్లికగలదియుగాక కటుపద భూయిష్టముగా నున్నందున పెద్దనార్యకృతము కాదని నిశ్చయింప వలసి యున్నది. అయినను కృత్యాద్యవస్థయందు వంశావళిలో పెద్దన ప్రణీత మయిన మనుచరిత్రములోని పద్యములే యిందు గానబడు చున్నందున రెంటికిని గృతికర్త లొక్కరేయని యూహింపవలసి యుండునని కొంద ఱందురుగాని యీయూహ సరియైనదికాదు. వంశావళిలో కృష్ణదేవరాయని జయములును గుణవర్ణనలు మాత్రమే యధికముగా నున్నందున, ఆత్మస్తుతిని దన పద్యములతో జేసికొనుట కిష్టములేనివాడయి కృష్ణదేవరాయలు ప్రధమపురుషములను మధ్యమపురుషములనుగా మార్చి వేంకటేశ్వరుడు తన్నుగూర్చి పలికినట్లుగా మనుచరిత్రములోని పద్యములనే తన యాముక్తమాల్యదయందు వేసికొనియుండును. అయినను విష్ణుచిత్తీయమునందు ముఖ్యముగా నయిదవ యాఱవ యాశ్వాసములయందు పెద్దనపద్యములవంటి "యల్లిక జిగిబిగి" గల పద్యములును బెక్కులు కానబడుచున్నందున గృష్ణదేవరాయలు తన యాస్థాన కవీశ్వరులైనవారి సాహాయ్యమును స్వగ్రంథరచనమునందు బొందియుండును. ఒక్కసాహాయ్యమే యననేల? ఆ యిరువురుకవులును ముఖ్యముగా నాంధ్రకవితాపితామహు డని పేరొందిన యల్లసాని పెద్దనయు రచించిన పద్యములే పెక్కు లాముక్తమాల్యదయం దున్నట్లు కానబడు చున్నవి. అంతమాత్రముచేత గ్రంథకర్తృత్వమును వారి కారోపించుట వలనుపడదు. గ్రంథమును రాజేచేయగా తదాస్థానకవులు కొన్నిపద్యములను మార్చియు, కొన్నిపద్యములను తమవిచేర్చియు నుందురు. కృతి