పుట:AndhraKavulaCharitamuVol2.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృత్తిచే జీవించుచు భక్తితో శ్రీరంగనాయకునకు తులసిమాలల నర్పించుచు కాలము గడుపుచుండెను.


శా. స్వాధ్వాయంబు బఠించు సాంగకముగా సంధ్యాద్యనుష్ఠానముల్
   విధ్యుక్తక్రియ నాచరించు దఱితో వ్రేల్చుం బ్రపూతాత్ముడై
   మధ్యేరంగశయానమూర్తి కిడు సమ్యద్భక్తి దోమాలికల్
   మధ్యాహ్నంబున గుక్షి బిక్ష దనుపు న్మాధూకరప్రక్రియన్.


ఇట్లుండగా మధురవాణియు దేవదేవియు ననువేశ్య లక్కచెలియం డ్రిద్ద ఱాతనిని దేవాలయములో జూచి యాతనినిష్ఠ కద్భుతపడి భక్తితో మ్రొక్కగా నతడు వారిమ్రొక్కు గైగొనకపోయెను. అప్పుడు దేవదేవి యలిగి యప్పతో


ఉ. మ్రొక్కిన నెవ్వ రే మనడు; మో మటువెట్టుక చక్కబోయె; నీ
   దిక్కును జూడడాయె; నొకదీవనమాటయు నాడడాయె; వీ
   డెక్కడి వైష్ణవుండు ? మన మేటికి మ్రొక్కితిమమ్మ ? యక్కటా!
   నెక్కొని వెఱ్ఱిబుద్ధి యయి నిద్దురవోయినవానికాళ్ళకున్.

అని యతని నిరాకరించి పలికెను. మధురవాణి చెల్లెలి నూరార్చుచు,

ఉ. చూచిన నేమి? నీవలను చూడకయుండిన నేమి? పూజ్యులం
   జూచిన భక్తి మ్రొక్కుటయె శోభన; మీతడు బ్రాహ్మణుండు;ధా
   త్రీచరులందు బ్రాహ్మణుండు దేవుడు; దేవుడు నీవు మ్రొక్కినన్
   జూచునొ? పల్కునో? యటుల సుమ్మితడున్ నరసీరుహాననా!

అని శాంతచిత్తను జేసి యతనివై రాగ్యమును గొంత ప్రశంసించెను. అప్పు డప్పమాట లంగీకరింపక,


చ. ప్రకటజితేంద్రియుల్ ధర బరాశరకౌశికులంతవారు స్త్రీ
   లకు వశు, లంతకంటె మిగులన్ దృడమౌమగకచ్చ బిగ్గ గ
   ట్టుకొనగ నీత డెంత? శుకుడో? హనుమంతుడొ? భీష్ముడో? వినా
   యకుడొ? తలంచుకో నరసిజాయతలోచన నెమ్మనంబునన్.