పుట:AndhraKavulaCharitamuVol2.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డయిన నరసింహరాజు రాజ్యమునకు వచ్చెను. ఇతడు 1487 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శాసనములవలన దెలియవచ్చుచున్నది. కొందఱితడు 1505 వ సంవత్సరమువఱకు మాత్రమే రాజ్య పరిపాలనము చేసె ననియు, ఆసంవత్సరము మొదలుకొని యాతని జ్యేష్టపుత్రు డయిన వీరనృసింహరాయలు పరిపాలనము చేసెననియు చెప్పుచున్నారు. ఇదియే నిజమై యుండవచ్చును. పే రొక్కటియే యై యుండుటచేత శాసనములను పరీక్షించినవారు కొడుకునుగూడ తండ్రినిగా భ్రమించియుందురు. 1509 వ సంవత్సరమునందు కృష్ణదేవరాయల ప్రభుత్వ మారంభమైనది. కృష్ణదేవరాయలు రాజ్యమునకు రాకముం దాతని యన్నయైన వీరనృసింహరాయలు కొంతకాలము రాజ్యము చేసినట్లు కృష్ణదేవరాయల కంకితము చేయబడిన గ్రంథములయం దెల్లరు జెప్పబడియున్నది:-

క. వీరనృసింహుడు నిజభుజ

దారుణకరవాలపరుషధారాహతవీ

రారియగుచు నేకాతవ

వారణముగ నేలె ధర నవారణమహిమన్.

క. ఆవిభు ననంతరంబ ధ

రావలయము దాల్చె గృష్ణరాయుడు చిన్నా

దేవియు శుభమతి తిరుమల

దేవియునుం దనకు గూర్చు దేవేరులుగన్ - మనుచరిత్రము,

క. వారలలో దిప్పాంబకు

మారుడు పరిపంధికంధిమంథాచలమై

వీరనరసింహ రాయడు

వారాశిపరీతభూమివలయం బేలెన్.