Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్ధశిల్పములు చిన్న దేవకోష్ఠములందు గలవు. గుహాలయ కపోత విభాగమున 'కూడు' డిజైన్లు లేవు. ఈ గుహయందు త్రిమూర్తులు లేరు, ఒకటవ గుహకు,రెండవ గుహకు మధ్య చాలా చిన్నతరహా గుహాలయ(memorial shrines) సమూహ మున్నది. వీటిలో చిన్న గర్భగృహ, అందు పానవట్టమున్నది. శివలింగము లేదు. ఈ చిన్న దేవగృహముల క్రిందిభాగమున మరీ చిన్నచిన్న గుహాలయములందు (memorial shrines) చిన్న చిన్న శివలింగములు చెక్కబడియున్నవి. వీటి చెంతనే ఒక చిన్న శాసనము 'ఐశ్వర్య దామోదరేశ్వర దేవగృహం' అనియు, మరొక శాసనములో 'ధీరుకంతి చామాచారి'చే ఈ ప్రసిద్ధ బ్రహ్మేశ్వర నివాసము నిర్మింపబడినదనియు వ్రాయబడియున్నది.

మూడవ గుహాలయము:

ఇది మునుపటి రెండు గుహలవలె 5 అ॥ చతురస్రముగ నున్నది (18, 33, 35వ చిత్రపటములు చూడుము). ద్వారమున కిరువైపులా ద్వారపాలకులు గలరు. ఉత్తర భాగమందుండు ద్వారపాలకునకు శృంగయుతోష్టేషము కలదు. ఈ గుహ ప్రాంగణము 9½అ॥పొడవు, 6 అ॥వెడల్పు గలదు (16వ చిత్రపటము చూడుము). ఇది రెండవ గుహ ప్రాంగణముకంటె పెద్దది. ద్వారపాలకుల చిత్రణలో ఇచట కొంత ఎక్కువ నైపుణ్యము కనబడుచున్నది. దీనికి అర్ధమండపముగాని,ముఖమండపముగాని లేదు. చిన్న ప్రాంగణము మాత్రమే యున్నది. శివలింగమునకు ఎదురుగా (వెలుపల) పశ్చిమ ముఖభాగముగా నంది కలదు. మూడవ గుహాలయము నందు శివలింగము ఆధునిక కాలానికి చెందినది గలదు. ప్రాంగణమునందు ఉత్తర దక్షిణములందు గణేశ,చండేశ అర్ధశిల్పములు గలవు.

ఈ గుహాలయమునకు కపోత విభాగము రూపొందింపబడలేదు. ఇచటి నంది విగ్రహము పల్లవరీతిలో యున్నది. ఈ గుహాలయము క్రిందగా రెండు చిన్న గుహాలయములందు (memorial shrines) చిన్నచిన్న శివలింగములు చెక్కబడియున్నవి.

పై మూడు గుహలను పరీక్షించినచో ఈ మూడును ఒకేరీతిగా చెక్కబడినట్లుగా మనకు తెలియుచున్నది.

నాలుగవ గుహాలయము:

ఈ గుహాలయము అసంపూర్తిగా యున్నది. గర్భగుడి 4½అ॥చతురస్రాకారము గలిగియున్నది ( 17,18, 19,33, 35వ చిత్రపటములు చూడుము). గర్భగృహ మధ్యయందు పానవట్టమున్నది. పానవట్టము నందు నల్లని రాతితో చేయబడిన మెరుపుగల శివలింగమున్నది. ద్వారపాలకులు పల్లవరీతిలోనే యున్నారు. ఉత్తర వైపున గల ద్వారపాలకునకు శృంగయుతోష్ణేషములు గలవు. ఇచటి ప్రాంగణము అసంపూర్తిగా యున్నది. ఇది 13 అ॥పొడవు. 4 అ॥ వెడల్పు గలిగియున్నది. ఈ గుహలోని శివలింగమునకు వెనుక గల కుఢ్యముయొక్క ముఖభాగమున త్రిముఖయుత శివుని ('మహేశ') అర్ధశిల్పము గలదు (24వ చిత్రపటము చూడుము) ఇతనికి మూడు తలలు గలవు. పల్లవ గుహాలయాలలో సోమస్కంధ చిత్రరూప ముండును. కాని ఇచట పేరు ఇచటి మహేశ ఎల్లోరా ప్రాంతమంతలి క్రీ.శ. 8వ శతాబ్దమునకు చెందిన మహేశ శివునివలె యున్నది (25వ చిత్రపటము చూడుము).

ప్రాంగణమునందు నంది మలచబడిన రూపురేఖలు గలవు. శిల్పము నాశనమై యున్నది. ప్రాంగణమున ఉత్తర దక్షిణ భాగములందు చిన్నచిన్న దేవకోష్ఠములు గలవు. ఈ కోష్ఠములలో ఒకదానియందు 'గణేశ' అర్ధ