పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయ భాగం

జైత్రయాత్ర

ర్వసేనాధిపతి బ్రహ్మదత్తప్రభువు ఇక్ష్వాకు సైన్యాలతో ధాన్యకటక నగరం చేరినాడు. అంతకుముందే మహారాజు ద్వితీయ భార్యతో ధాన్యకటకం చేరెను. శ్రీశ్రీయజ్ఞశ్రీ శాతవాహన చక్రవర్తి స్ప్రుహలోలేడు. మహావైద్యులు వైద్యం చేస్తున్నారు. బౌద్ధాచార్యులు త్రిశరణములు పఠిస్తున్నారు. ఆర్యపండితులు పౌష్టిక మంత్రాలు పఠిస్తున్నారు.

చక్రవర్తికి చైతన్యం వచ్చి అల్లుడు శాంతమూలుని పిలిచి అస్పష్ట వాక్యాలతో, “ప్రభూ! మా అవసానదశలో నీ బాహుబలమే ఈ సామ్రాజ్యాన్ని సంరక్షిస్తున్నది. ఈ రాజ్యంపై మాక్రొత్త ఏల్బడిలో వివిధ సామంతులు తిరుగబడినప్పుడు మీరు చూపిన మహావిక్రమము, మా రాజ్యం నిష్కంటకం చేసింది. మేము ఇంక గడియకో, అర్థగడియకో వెళ్ళి పోతాము. మీ బావమరిది విజయశాతకర్ణిని మీ చేతులలో పెట్టి వెళ్ళుతున్నాము ప్రభూ” అని దాపున ఉన్న కొమరుని పిలిచి, అతనిచేయి శాంతి మూలుని చేతిలో పెట్టి “స్కంద దేవాయనమః, బుద్దదేవాయనమః” అంటూ చిరునవ్వుతో ప్రాణం వదిలాడు.

శాతవాహన మహాచక్రవర్తులలో తుది చక్రవర్తి నిర్యాణం పొందినాడు; చక్రవర్తి వపువును చందనాది తరుకాండాలతో బూది చేసినారు. కుమారుడు నలుబది. అయిదేండ్లవాడు. విజయశాతకర్ణి మహారాజు తండ్రికి ఉత్తరక్రియలు సలిపి పితౄణము తీర్చుకొన్నాడు. ఆ వెనుక శుభమూహూర్తంలో శ్రీశ్రీ విజయ శాతకర్ణి నవకోటి బంగారుపణముల విలువగల ఆంధ్రసింహాసనంపై పట్టాభిషిక్తుడైనాడు.

ఉత్తర కళింగాధిపతులు వాసిష్టులు, దక్షిణ కళింగాధిపతులు, మాఠరులు, వేంగీరాష్ట్రాధిపతులు, సాలంకాయనులు, మంజీర రాష్ట్రాధిపతులు, గౌతములు, గృధ్రరాష్ట్రాధిపతులు, బృహత్పలాయనులు, క్రమక రాష్ట్రాధిపతులు, ధనకులు, పూంగీ రాష్ట్రపతులు, చళుక రాష్ట్రాధిపతులు, కదంబులు, నాగదేశాధిపతులు, చూతకుల శాతకర్ణులు, ములకరాష్ట్రాధిపతులు, ఆశ్మకులు, ఆభీరులు, మాళవులు, కురవులు, మంజీరాధిపతులు మొదలయిన వారి ప్రతినిధులు నూత్న చక్రవర్తి అభిషేకానికి ఆహూతులై వచ్చారు. ఆవెంటనే మా ఏవులు, అభీరులు తమ స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. వనవాసాధిపతులు, చూతకుల శాతకర్ణులు కూడా స్వాతంత్ర్య ప్రకటన చేసారు. ఆంధ్రసామ్రాజ్యము చిన్న చిన్న చక్రవర్తులతో నిండిపోయింది.

ఇక్ష్వాకు శాంతిమూలమహారాజు బ్రహ్మదత్త ప్రభువుని చూచి, “స్కందవిశాఖాయనక ప్రభూ! మీరు మన సైన్యాలతో మా బావగారికి బాసట కావలసిం’దని ఆదేశమిచ్చినాడు.

చక్రవర్తిని కనుంగొని “మహాభ్రూ! మీరు సైన్యాలతో వానాకాలమైనా సరే, బయలుదేరి ఒక్కసారి దిగ్విజయ యాత్రచేయండి. తమ కుడి చేయిగా మా ధనకప్రభువు

అడివి బాపిరాజు రచనలు - 6

53

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)