పుట:Ambati Venkanna Patalu -2015.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌరమ్మ గాంభీరం ఉయ్యాలో
తాంబాలము నిండె ఉయ్యాల
పట్టుబట్టలుగట్టి ఉయ్యాలో
పడుసుపిల్లలు మురిసె ఉయ్యాలా
గౌరినీ జూడంగ ఉయ్యాలో
నీలిమబ్బురాదా ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గంధాలుబుయ్యంగ ఉయ్యాలో
గంతులేసే పిల్లలు ఉయ్యాలా
రింగన్న పురుగోలె ఉయ్యాలో
రివ్వున రివ్వున దిరిగె ఉయ్యాలా
అమాస సీకట్లో ఉయ్యాలో
మినుగురు పూలయ్యె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మొగపిల్లలా కొరకు ఉయ్యాలో
పచ్చిపసరు దాగే ఉయ్యాలా
పట్నాలలో జూడ ఉయ్యాలో
కన్నఏశమాయె ఉయ్యాలా
కట్నమియ్యలేక ఉయ్యాలో
కడుపులోనె బొంద ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆడజన్మలు గౌరి ఉయ్యాలో
సృష్టికే మూలంబు ఉయ్యాలా
గౌరమ్మనెత్తంగ ఉయ్యాలో
ఆడబిల్లలు లేక ఉయ్యాలా
నిన్నుమోసే తల్లి ఉయ్యాలో
నిమిషమన్న దలిసెఉయ్యాలా ॥బతుకమ్మ॥

49

అంబటి వెంకన్న పాటలు