పుట:Ambati Venkanna Patalu -2015.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలుపెరగని అలలను జూసినమే...... ఓ గంగమ్మ
నిదురెరుగని రాత్రుల మోసినమే....... మా గంగమ్మ
పాల నురగతో పరుగున వచ్చి
తీరంజేరే తడలను జూసి
ఈదుతూ ఈదుతూ నీ వొడిజేరిన
బెస్తబోయులం నీ కన్న బిడ్డలం
కనుమూసే కాలం వచ్చిందే ఓ....గంగమ్మ
కడసూపుకు నోసుకోలేదా మా....గంగమ్మ

నిండు జెరువును సూసిన కాలంలో ఓ......గంగమ్మ
నిన్ను ఆకాశ గంగనుకున్నామే మా.....గంగమ్మ
నీ వొడిలో మోపిన మోటుకాళ్ళను
తడబడు అడుగుల పసిపోరలను
కదులుతు, మెదులుతు వొళ్ళు రుద్దుతూ
సంబరంగ నువ్ జోల పాడినవ్
నువులేక పచ్చుల మైనామే ఓ.....గంగమ్మ
నినుజూడ బయలెలుతున్నామే మా....గంగమ్మ

ఈ ఎండిన సెరువును జూస్తేనే ఓ.....గంగమ్మ
మా గుండె సెరువయ్యిందమ్మో మా.....గంగమ్మ
కదలేక మా కొస ఊపిరితో
ఉగ్గబట్టి మేం నడుస్తున్నము
కాలు గదిపితే ఎండిన వొండు
శూలమయ్యి మరి గుచ్చుతున్నది
మా శోకం నీకిన పడదాయె...... ఓ గంగమ్మ
కన్నీటి అలుగులు గనవాయె....మా గంగమ్మ ॥మాకెదురు॥
మదినిండా నిలిపినమే తల్లీ ఓ........గంగమ్మ
మా ఇంటి దేవతవే తల్లీ ఓ........గంగమ్మ
నీ పండుగ జేసినమే తల్లీ మా.....గంగమ్మ

అంబటి వెంకన్న పాటలు

130