పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రార్ధన చేసినట్లవుతుంది. పౌలు భక్తుడు చెప్పినట్లుగా నిరంతరం ప్రార్ధన చేసినట్లవుతుంది -1తెస్స 5, 17. పనిని జపంగా మార్చుకోవాలంటే రెండు సూత్రాలు పాటించాలి. మొదటిది, మోసంతో గాక చిత్తశుద్ధితో పని చేయాలి. రెండవది, శక్తి కొలది పనిచేసి దాన్ని దేవునికి సమర్పించాలి. మీ పనులన్నీ క్రీస్తు పేరు మీదిగా చేయమన్నాడు పౌలు భక్తుడు -కొలో 3,17. జపం వ్యక్తిగతమైంది. ఒకరు జపించినట్లుగా మరొకరు జపించరు. నిజానికి ఎంతమంది నరులున్నారో అన్ని ప్రార్థనా పద్ధతులున్నాయి. మన కష్టసుఖాలూ జయాపజయాలూ, వ్యాధిబాధలూ శోధనలూ భయాలూ బలహీనతలూ మొదలైన వన్నీ దేవుని ముందు పెట్టాలి. మన హృదయంలో దేవుడు పుట్టించే ప్రేరణలూ అతడు చెప్పే సమూధానాలూ వింటూండాలి. జపం అచ్చు పుస్తకాల్లో నుండి కాక హృదయంలోనుండి రావాలి. షిలో దేవాలయంలో అన్నా భక్తురాలు తన హృదయంలోని ఆపసోపాలను దేవునిముందు వెళ్లగక్కింది -1సమూ 1,10–11. తరచుగా కష్టాలు చుట్టుముట్టినపుడు స్వచ్ఛమైన జపం వస్తుంది. ప్రార్థనలో పసిబిడ్డడి వాలకం వుండాలి. బిడ్డడు నమ్మకంతో తల్లిదండులను నాకు పలానా వస్తువీయమని అడుగుతాడు. అమ్మానాన్న వాడడిగింది యిస్తారు -మత్త 7,9-11. దేవునిపట్ల నమ్మకం ఎంత గట్టిగా వుంటుందో మన ప్రార్ధనం గూడ అంత బలంగానే పనిచేస్తుంది. ప్రార్థనకు పరీక్ష యేమిటి? జపం వల్ల మన స్వార్థం తగ్గాలి. నాకేమి లాభం కలుగుతుందా అన్నట్లుగా గాక, నా వల్ల ఇతరులకేమి లాభం కలుగుతుందా అన్నట్లుగా ఆలోచించాలి. మనం తోడివారికి వుపయోగ పడాలి. సోదరప్రేమ పెరగాలి. తీసికోవడం కంటె ఈయడం ముఖ్యమని గుర్తించాలి. మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. కష్టాల్లో దైవచిత్తానికి లొంగాలి. అన్యాయాలకూ మోసాలకూ పాల్పడకూడదు. ఈ మార్పు మనలో