పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీడులు, విపత్తులు ఎందుకు వచ్చాయో మనకు వెంటనే తెలియదు. ఐనా విశ్వాసంతో వాటిని అంగీకరించాలి. దేవుడు అమ్మా నాన్నలాగ మన మేలు కోరేవాడే కాని మనలను బాధించి సంతోషించేవాడు కాదు. మన తరపున మనం అతని ఆజ్ఞలను ఖండితంగా పాటించాలి. పెద్దల మాట వినాలి. మన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి. అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవాలి. లేకపోతే దేవుని చిత్తాన్ని మీరుతాం. చిన్నదైనా పెద్దదైనా పాపాన్ని విడనాడాలి. పాపం వలన దైవచిత్తాన్ని నేరుగా మీరతాం. మామూలుగా దేవుని చిత్తమేమిటో మన అంతరాత్మే తెలియజేస్తుంది. స్వార్ధంతో, చపలంగా మనస్సాక్షికి వ్యతిరేకంగా పోకూడదు. 4) దీని వలన లాభాలు దేవుని చిత్తానికి లొంగడం వలన చాల లాభాలు వున్నాయి. దీని వలన నరుడు దేవునితో దగ్గర సంబంధం పెట్టుకొని భక్తిగా జీవిస్తాడు. దేవునికి ప్రీతి కలిగించే పనులే చేస్తాడు కనుక అతని జీవితం సురక్షితంగా వుంటుంది. అతని జీవితంలో శాంతీ సంతోషమూ నెలకొంటాయి. దేవుని మార్గాల్లో నడచాడు గనుక అతడు ప్రశాంతంగా మరణిస్తాడు. ఇవి స్వల్పభాగ్యాలు కాదు. పెద్ద తెరేసమ్మగారు దైవ చిత్తానికి లొంగడాన్ని మహాపుణ్యంగా భావించారు. తనకు అంతకంటే గొప్పభాగ్యం మరేదీ లేదని నుడివారు. కనుక మన జీవితంలో దైవచిత్తం పాలెంత, మన చిత్తం పాలెంత అని పరిశీలించి చూచుకోవాలి. 7.ఆత్మ ప్రేరణలను పాటించాలి. 1) ప్రేరణలు అంటే యేమిటి? ప్రేరణలు అంటే కోరికలు. ఆత్మ తన వరప్రసాదబలంతో మన మనస్సుల్లో మంచి కోరికలు పుట్టిస్తుంది. ఇవి మన నడవడికను మార్చేంత బలంగా వుంటాయి. ఆంతరంగికంగా హృదయంలో విన్పిస్తాయి.