పుట:Abraham Lincoln (Telugu).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"కూర్మమాత్రమున కింతేల యఱచెదరని" యొక్కండు నివారింప జూచెను. అయిన నాబ్రహా మొక కొయ్యతో నా తా బేటిపై నగ్గిని ద్రోసివేసి పిడికిలిబట్టి ధిక్కరించుచు నా దెబ్బకు దాళజాలితివేని దాని నలయింప సమకట్టుమని యా బాలు నట్టె నెట్టివైచెను. కరుణా విహీను డగు బాలుడు "ఆహా! నీవంటి భీరు వీ జగంబున లేడు. నీ కా కచ్ఛపము సోదరుడు గా బోలు" నని హేళన మొనర్ప దొడగెను. "సోదరుడైన నగుగాక. నాయెదుట నీ విట్టి క్రూరకృత్యంబులు గావింపకుండు" మని యాబ్రహాము శాసించెను. ఇంతలో నొక కొందఱు బాలు రాతనితో నేకీభవించుటయు నా తా బేటి వేదన తీరిపోయెను.

ఒకానొకరోజు బడి తీరి విద్యార్థు లెల్లరును దమతమ యిండ్లకు వెడలుచుండిరి. అం దిద్దఱకు వర్ణక్రమ విషయమున నొక పోట్లాట ప్రారంభ మాయెను. కొంచెపుమాటలు పోయి కఠినోక్తులకు దిగి కఠినోక్తులుపోయి ముష్టియుద్ధము ప్రారంభ మగుగాల మాసన్న మాయెను. ఇది గమనించి యాబ్రహాము వా రిద్దఱి మధ్యజేరి వారి భుజములపై జేతులునిచి యందొక్కరుని "ఈపనికిమాలిన విషయమున కింత పోర నేటికి? రా రమ్మ"నియెను. వాడు "న న్నన్యాయముగ గల్లరి యననేల? నిన్ననిన నీ వూర కుందువే?" యనెను. తరువాత