పుట:Abraham Lincoln (Telugu).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన తెలుగుసీమవారుమాత్ర మితర యన్నివిషయములందువలె భాషాభివృద్ధివిషయమునను గాడనిద్ర పోవుచున్నారు. ఇది మిక్కిలి శోచనీయము. ఇట్లనుటచే నిదివఱకు నాంధ్రభాషాభివృద్ధికై పాటుపడిన వారిని మే మెఱుంగ మని గాని, వారు మనభాష కొనర్చిన మహోపకారమునకై మేము కృతజ్ఞత జూపనొల్ల మని గాని చదువరులు తలంపవలదు.

భాషాభివృద్ధికి గద్యగ్రంథంబు లత్యంతావశ్యకంబు లని మొట్టమొదట గనిపెట్టినది చిన్నయసూరి. తెనుగులోని గద్యగ్రంథంబుల కాతడు నన్నయభట్టు. ఇట్లు చిన్నయసూరిచే బ్రారంభింపబడిన వచనకావ్య పద్ధతిని మిక్కిలి ప్రబలజేసి, విద్వాంసులకును, జనసామాన్యమునకును, స్త్రీలకును గావలయు గ్రంథరాజంబు లనేకంబులు నిర్మించి, గ్రంథసంఖ్యాబాహుళ్యంబుచేతను, సకలజనాదరణీయంబును సకలజనానుకరణీయంబును నగు శైలిని నిర్మించుటచేతను, గద్యతిక్కన యని చెప్పుటకు నర్హులు రావుబహదరు కందుకూరి వీరేశలింగముపంతులవారు, పంతులవారి యితరమతము (Opinions) లను గుఱించి యెవ రేమనుకొన్నను, వారు మనభాషను నభివృద్ధిచేయుటకై చేసినకృషికి వారి నభినుతించునెడ విజ్ఞానము గల యాంధ్రులందఱును నేకీభవింపక తప్పదు.

వీరుగాక యనేకులు పూర్వతరమువారును, మనతరమువారును దమగద్యగ్రంధంబులచే దెలుగుబాసను నలంకరించిరి. వారిలో మ. రా. రాశ్రీలు, కొక్కొండ వేంకటరత్నముపంతులవారును, శతఘంటము వేంకటరంగశాస్త్రి గారును, పూండ్ల రామకృష్ణయ్యపంతులుగారును, వేదము వేంకటరాయశాస్త్రిగారును, శేషగిరిశాస్త్రిగారును, పనప్పాకము శ్రీనివాసాచార్యులు బీ.ఏ.బీ.ఎల్ గారును, నాటకములకు నూతనమార్గము చూపినందుకు ధర్మవరము కృష్ణమాచార్యులు గారును, కల్పితకధలు వ్రాయుటలో జిలకమర్తి లక్ష్మీనరసింహముగారును, స్త్రీల కుపయుక్త గ్రంథములు వ్రాయుటయందున గీర్తి శేషురాలగు భండారు అచ్చమాంబగారును, శ్రీమతి కొటికల