పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మిని.

35

ప్రజ్వలింప వారు శత్రువులకు మిగుల దుస్సాధ్యులని తోఁచిరి. కాని విస్తీర్ణమగు యవనసైన్యముముం దల్పమగు రజపూత సైన్యమున కెట్లు జయముదొరకును? ఆసాయంకాలమువఱకు క్షత్రియ వీరులందఱు వీరస్వర్గమున కరుగఁగా జయలక్ష్మి అల్లా ఉద్దీనునే పొందెను.

భీమసింహునితోడ సకల రాజపుత్రులును యుద్ధమున మడియుట నగరమునందుండిన స్త్రీలకుఁ దెలియఁగా పద్మినియు సకల రజపూతుల భార్యలును పాతివ్రత్య రక్షణమునకై అగ్నిప్రవేశముచేయ నిశ్చయించుకొనిరి. ఇట్లు వారు కృతనిశ్చయురాండ్రై యొకగొప్పచితిఁబేర్చి దాని కగ్నిముట్టించిరి. అందుపై పద్మిని తాను ముందాయగ్ని యందు దుముకఁగా నందఱు స్త్రీలును దుమికిరి (ఈయగ్నిప్రవేశమునే రజపూతులు జోహారు, లేక జహరవ్రత మనియెదరు). బాదుషా విజయానందముతో పురప్రవేశము చేయఁగా నాగ్రామమంతయు చితామయమయి యుండెను. అందు తానింత ప్రయత్నముఁ జేసి చేకొనఁదలఁచిన పద్మినిదేహము భస్మమయి యుండఁగాఁ జూచి అల్లాఉద్దీను మిగుల వగచెను. యుద్ధమునకుఁ బ్రయాణమైనపుడు భీమసింహుఁడే స్త్రీలనందఱ నొకగుహలోనికిఁ దోలి యాగుహను మూసి గుహద్వారమున కగ్ని యంటించెనని కొంద`రు చరిత్రకారులు వ్రాసియున్నారు.