పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగారు శిఖరముగల యింకొక గుడిని గట్టించి దానిలో బేటేశ్వరుడను లింగమును బ్రతిష్ఠింపచేసెను. ఈ గుడికినై యీదేవి ఫలవంతమగు బీనదీవియను గ్రామము నొసంగెను. ఈ మహనీయురాలు ధన్యకటకపురిలో 12 గురు బ్రాహ్మణోత్తములకు 12 భూవసతులు 12 గృహములును దాన మొసంగెను. ఈమె తనతండ్రియగు గణపతిదేవునిపేర గణపేశ్వరుని (శివుని) యాలయ మొకటి కట్టించెను. ఈ గుడికై యీరాణి చింతపాడు గ్రామము నొసంగెను. ఈ రాణి హస్తములు సతతము శివుని నర్చించుటయందే వినియోగించెను. శివుని మహాత్మ్యమును బ్రకటించు శ్లోకములే ఆమెకానందము నిచ్చుచుండెను. ఈ రాణి వేదములయం దధిక విశ్వాసము కలది కావుననే విశాల రాజ్యక్లేశము కలిగి యున్నను ఆనందముతో దినములు గడపెను. రెండవపార్వతి యనదగిన యీమె మహాత్మ్యము నెవ్వరు తగినట్టుగ వర్ణింప గలరు? ఈ మహనీయురాలి చరితముగురించి యింతకంటెనధిక మేమియు దెలియదు. కాన విధిలేక మిగుల చింతతో దీనిని ముగించుచున్నదాన.


_______