పుట:Abaddhala veta revised.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దృష్టి పెట్టి, మిగిలిన ఆలోచనలు రానివ్వకుండా చూడమంటారు. అదే ఆలోచన చంపడానికి నాంది. ఆలోచిస్తే ప్రశ్నలు వస్తాయి. గుడ్డిగానమ్మడం వలన ఆలోచన చచ్చిపోతుంది. అలా ఆరంభించిన యోగం 8 మార్గాల సోపానం చెప్పింది. ఇందులో మెట్లు మెట్లుగా మనిషిని తీసుకుపోయినారు. మోక్షం అంటే వెంటనే అందరూ ఒప్పుకోరు గనుక, ఆధునిక పదజాలంతో ఆకర్షించడం యోగంలో పెద్ద ఎత్తుగడ.

యోగానికీ, ఆరోగ్యానికి చికిత్సకూ సంబంధం లేదు. కాని కొందరు అలాంటి సంబంధం కల్పిస్తున్నారు. యోగాభ్యాసాలతో ఎక్సర్ సైజ్ 8 మార్గాలలో ఒక మార్గమే. అలా చెప్పక మభ్యపెట్టడం వారి చిత్త ప్రవృత్తికి గీటురాయి.

యోగంవలన దీర్ఘాయిస్సు అనేది మరొక భ్రమ, శంకరాచార్యులు, వివేకానంద, రామకృష్ణ పరమహంస(గదాధర్), రమణ మహర్షి యోగం చేసిన వారే. వివేకానంద 38ఏళ్ళకి చనిపోయాడు. రమణ, రామకృష్ణలు కేన్సర్ తో చనిపోయారు. శంకరాచార్య 32 ఏళ్ళకే చనిపోయారు. కనుక ఆయుస్సు గురించి మరిచిపోవాలి.

యోగాభ్యాసాల వలన మెదడు ఎలా పనిచేస్తుందో యోగులకు తెలియదు. ఆనాడు అంత సైన్స్ పెంపొందలేదు. నేడు మెదడు గురించి చాలా తెలుస్తున్నది. ఇంకా తెలియాల్సింది ఎంతో ఉంది.

మెదడు నాలుగు విధాలైన తరంగాలు ప్రసరిస్తుంది. మెదడు పనిచేసే తీరులో తరంగాలకూ సంబంధం వుంది.

నిద్ర పోతున్నప్పుడు అల్ఫాతరంగాలు వస్తాయి.

దృష్టి కేంద్రీకరించినప్పుడు బీటా తరంగాలుంటాయి.

సమస్యలు సాధించేటప్పుడు, పనిచేస్తున్నంతసేపు బీటా తరంగాలు వుంటాయి.

గాఢ నిద్రలో డెల్టా తరంగాలు వస్తాయి.

మోహనిద్రావస్తలో (సుషుప్తి దశ) తీటా తరంగాలు వుంటాయి.

ఈ తరంగాలను ఎలక్ట్రోసిఫలోగ్రాఫ్ (ఈజి) యంత్రంతో కొలుస్తారు. జెన్ బౌద్ధం యోగులు పేర్కొనే సుషుప్తి అవస్తను నేడు సైన్స్ వివరిస్తుంది. ఎం.ఎన్.రాయ్ ఈ విషయాన్ని వివరంగా శాస్త్రీయంగా రాశారు.

యోగంలో ప్రాణాయామం ఒకటి. మనిషి ఊపిరిపీల్చడం వదలడం అనుకోకుండా చేసే పని. యోగంలో ఊపిరి బిగబట్టమంటారు. అంటే పీల్చిన ప్రాణవాయువు బొగ్గుపులుసు వాయువుగా మారిన తర్వాత వదిలివేయాలి. కానీ, అట్టిపెడితే అది శరీరానికి పనికిరాదు. గనుక