పుట:Abaddhala veta revised.pdf/335

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత సబ్-ఇంజనీరుగా పైకివచ్చాడు. రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. కాటన్ కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు. ఆనకట్టపై ఒకచోట అతని పేరిట ఫలకం ఉన్నది. 1867లో వీరన్న చనిపోయాడు.

1879-80లో కరువు విషయమై నియమించబడిన ఫామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల అవశ్యకత, ప్రాధాన్యతను నొక్కిచెప్పి, కాటన్ వాదనను సమర్ధించాయి. వీటన్నిటి దృష్ట్యా నాటి గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్ కు "గోదావరి డెల్టా పితామహు"డని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు. రిటైర్ అయిన తరువాత 1863లో మరొక్కసారి కాటన్ ఇండియా వచ్చి వెళ్ళాడు.

1899 జులై 14న ఆర్థర్ కాటన్ చనిపోయాడు. భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా గోదావరివాసులకు బంగారుపంటల్ని యిచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ప్రజల దీనావస్థ కళ్ళారా చూచి, తెలుపు నలుపు అనే రంగు బేధం లేకుండా, మానవతాదృక్పధంతొ ఆచరణకు ఉపక్రమించిన మానవతావాది కాటన్. అందుకనే ఆయన నాటికీ, నేటికీ ఆదర్శప్రాయుడు. వృధాగా పోతున్న నీటిని ప్రవహించే బంగారంగా మార్చిన కాటన్ ముందుచూపు గమనార్హమైనది.

ఆర్థర్ కాటన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోదగినవారు ఆయన కుమార్తె లేడీహోవ్ పరిష్కరించి ప్రచురించిన "సర్ ఆర్థర్ కాటన్" అనే గ్రంథం చదవాలి. తొలిసారి 1900లో ప్రచురితమైన యీ గ్రంథం 1964లో కలకత్తా ఇంజనీరింగ్ అసోసియేషన్ వారు మరలా ప్రచురించారు.

- హేతువాది, నవంబరు 1995
కార్మికోద్యమానికి స్ఫూర్తి వెంకట్రావు

ఆంధ్రలో కార్మికోద్యమ పితామహులలో ఒకడుగా పెమ్మరాజు వెంకట్రావు చరిత్రలో నిలుస్తారు. వి.వి.గిరి, బి. శివరావు వంటివారితో సన్నిహితంగా కృషిచేసిన ఖ్యాతి ఆయనది. 1907లో పుట్టిన పెమ్మరాజు వెంకట్రావు 1929 నాటికే గనుల ఇంజనీరింగ్ శాఖలలో (చీపురుపల్లి, విజయనగర ప్రాంతం) పనిచేసి అనుభవం గడించారు. 1931 నుండి నెల్లిమర్ల జూట్ మిల్స్ కార్మిక సంఘం స్థాపించి 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వున్నారు. అప్పుడే వరాహగిరి వెంకటగిరి,బి. శివరావులతో ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం, కార్మిక రంగంలో విశేష అనుభవం గడించడం ఆయన ప్రత్యేకత. 1938 సెప్టెంబర్ 1 నుండే కార్మిక పత్రిక అనే వారపత్రిక విజయనగరం నుండి పెమ్మరాజు వెంకట్రావు ప్రపంచ రాజకీయాల్ని అవగహన చేసుకుంటూ ఉద్యమాల్ని సాగించారు.