పుట:Abaddhala veta revised.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
దివ్యశక్తులు వుంటే
5 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు!

దివ్యశక్తులు, ఇంద్రియాతీత (అతీంద్రియ) మహిమలు ప్రాచీనకాలం నుండి నేటి వరకూ చర్చనీయాంశమే. నమ్మకస్తులు, భక్తులు, ఆస్తికులు యీ శక్తుల్ని ఏదో మేరకు ఒప్పుకుంటారు. వారి బలహీనతను ఆధారంగా పురోహిత వర్గాలు, బాబాలు, మాతలు వివిధ ప్రక్రియలతో ఆకర్షించి ఆర్జిస్తున్నారు. ఇంచుమించు వ్యాపార సరళిలో నమ్మకాలను నడిపిస్తున్న మతాలు అన్ని రంగాలలో ప్రవేశించి ప్రభావితం చేస్తున్నాయి.

ప్రశ్నించేవారు, సందేహించేవారు, శాస్త్రీయ పద్ధతిలో సాగిపోయేవారు ఇంద్రియాతీత శక్తుల్ని, మూఢ నమ్మకాలను,అద్భుతాలను బట్టబయలు చేస్తున్నారు. అయినా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇటీవల సైన్స్‌ను, కంప్యూటర్లను, సాంకేతిక జ్ఞానాన్ని మూఢనమ్మకాల వ్యాప్తికి వాడడం విశేషంగా కనిపిస్తున్నది. అది మరీ జనాకర్షణకు దారితీస్తున్నది. జ్యోతిష్యం, హోమియో వైద్యం కంప్యూటరైజ్ చేసి దుర్వినియోగం చేయడం ఎక్కువైంది.

మహిమలు, దివ్యశక్తులు ప్రశ్నార్థకంగా చేసిన వ్యక్తులలో జేమ్స్ రాండిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఆయన 25 ఏళ్ళ క్రితం 10 లక్షల డాలర్లు బ్యాంకులో పెట్టి ఇంద్రియాతీత శక్తుల్ని ప్రపంచంలో ఎవరు ఎక్కడ రుజువు చేసి అయినా, ఆ డబ్బు స్వీకరించమన్నాడు. ఇప్పటి వరకు ఆ పందాన్ని ఎవరూ గెలవలేరు. నిరంతరం జేమ్స్ రాండి ప్రపంచ పర్యటన చేసి, అద్భుతశక్తుల్ని, మహిమల్ని, భక్తి కూటముల రోగ చికిత్సను, హోమియో మోసాన్ని, జ్యోతిష్యాన్ని ఎండగడుతూనే వున్నాడు.

జేమ్స్ రాండి 10 పుస్తకాలు రాశాడు. అందులో సారాంశమంతా దివ్యశక్తులు, పేరా సైకాలజీ మహిమల గురించి గుట్టు రట్టు చేయడమే.

ఇటివల జేమ్స్ రాండి ఒక విజ్ఞాన సర్వస్వం వెలువరించాడు. అకారాది వరుసలో అన్నిచోట్ల ప్రచారంలో వున్న శక్తుల గురించి సంక్షిప్తంగా, హాస్యభరితంగా వెలువరించాడు. దీనికి ఆర్ధర్ సి. క్లార్క్ (శ్రీలంక శాస్త్రజ్ఞుడు) ముందు మాట రాశాడు.

టి.వి. ప్రసారాలలో జేమ్స్ రాండి శక్తుల-మహిమల బండారాలను బయటపెట్టాడు. చైనా నుండి ఆస్ట్రేలియా వరకూ పర్యటించి ఉపన్యాసాలిచ్చాడు. ఫిలిప్పిన్స్‌లో విపరీత మోసాలకు గురైన సైకిక్ సర్జరీ నిశితంగా పరిశీలించాడు. హోమియో దగాలను ఫ్రాన్స్, కెనడా, ఇజ్రాయల్, ఇంగ్లండు, అమెరికాలలో ఛాలెంజ్ చేసి, అసలు విషయాలు చెప్పాడు. అమెరికాలో భక్తి కూటాల దొంగ బాబాలను నిలబెట్టి వారి మోసాలను చెప్పడంతో కొందరు రంగ నిష్క్రమణ చేశారు. మరికొందరు దివాలా తీశారు.