పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక నీవు బోధిసత్త్వుడవు, ప్రతి దినమును బుద్ధు డుపదేశించిన ధర్మమార్గము నవలంబించుచు నిర్వాణమును బొందదలచి యున్నాడవు. బోధిసత్త్వునికి సమస్త జీవరాసుల యందును ప్రేమ యొక్కరీతిగా వ్యాపించియున్నది. అతని దయకు మేరలేదు. అతనికి ప్రాణము బుద్బుదప్రాయము, కాయముదారుకవలె క్షణికము, కావున బోధిసత్త్వుడవైన నీవేల నాయభీష్టమును నెఱవేర్పకుందువు? అట్లు చేయక నీవేల నీజీవితమందలి పరమపురుషార్థమును చెడగొట్టుకొందువు? అని యుపన్యసించెను.

"నాగార్జును డట్లా రాజకుమారుని మాటల నాలకించి "రాజకుమారా! నీవు బల్కినదంతయు సత్యము. నీవన్నయట్టు, నేను బుద్ధుడనగుటకు బ్రయత్నించుచున్నాను. బుద్ధుడగువాడు సర్వము త్యజింప సమర్థుడని నే నెఱుంగుదును. ఆతడు తన దేహము ప్రతిధ్వనివలె క్షణికమైన దనియు, ఆండజ జరాయుజ స్వేదజ, ఉద్భిజరూపమున, జీవుడు నరక, మృగ, ప్రేత, అసుర, నర, దేవతాకృతిని జన్మించుచు చచ్చుచుండుననియు నాత డెఱుంగును. జీవుల యొక్క కోర్కెల నడ్డగింపకుండుటయే నాప్రతిజ్ఞ, కాని రాజకుమారా! నీకోర్కె చెల్లించుట యందొక, ప్రమాదము కలదు. నే నెప్పుడు ప్రాణము విడుతునో, అప్పుడే నీతండ్రి, రాజును మరణించును. కావున బాగుగా యోచించుకొనుము. నాయనంతరము నీతండ్రిని బ్రతికింపగలవా రెవ్వరు నుండరు."