74
ఆనందమఠము
మహేంద్రుఁడు విస్మితుఁడై —— అతని మాటను నమ్మక ‘తమ కెట్లు తెలిసినది. తాము నాతోఁగూడనేకదా యున్నారు’ అనెను.
సత్యా —— నేనీమహావ్రతదీక్ష, చేసియున్నాఁడను. దేవుఁడు దయ చేసి పరోక్షజ్ఞానము నా కిప్పించి యున్నాఁడు. ఈ రాత్రి లోపల నీకు సమాచారము వచ్చును. ఈరాత్రికే నీవు కారాగారమునుండి విడివడుదువు.
మహేంద్రుఁ డేమియు నన లేదు. సత్యానందుఁడు, తాను జెప్పినమాటలలో మహేంద్రునికి నమ్మకము కలుగ లేదనితోఁచి, “నీవు నమ్మవా! కావలసినయెడల పరీక్ష చేసి చూడుము” అని చెప్పి కారాగార ద్వారముదాఁక వచ్చెను. అచ్చట నేమి చేసినదియు మహేంద్రునికిఁ దెలియదు. అయినను, ఎవరితోడనో మాటలాడుచున్నట్లు బోధ మయ్యెను. సత్యానందుఁడు మరలి వచ్చెను. మహేంద్రుం ‘డేమిపరీక్ష చేయవలయు’ నని యడిగెను.
సత్యా —— నీవు ఇప్పుడు కారాగారమునుండి విముక్తుఁడ వగుదువు.
ఇట్లు చెప్పుచుండు నంతలో కారాగారద్వారము తెఱువఁ బడెను. ఒకానొకఁడు లోపలికి వచ్చి, “మహేంద్ర సింహుఁడను వాఁడెవ” డనెను.
మహేంద్ర —— నేనే.
ఆగంతకుఁడు - ‘నిన్ను విడుదల చేయుటకు హుకుం వచ్చియున్నది. నీవు పోవచ్చు’ ననెను.