Jump to content

పుట:Aananda-Mathamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

ఆనందమఠము


చరుఁడనై 'పెండ్లము బిడ్డలతోఁ గాలహరణము చేయుచు నిన్ను దీవించుచుండెదను. సంతానధర్మము నతలజలమునఁ గలిపి వేయుము.

భవానందుఁడు కత్తిని ధీరానందుని మెడనుండి మెల్లగా దీసి, 'ధీరానందా! యుద్ధము చేయుము; నిన్నుఁ జంపెదను ; నేను ఇంద్రియ పరవశుఁడనై యున్నాను ; అయినను విశ్వాసఘాతుకుఁడను గాను నన్ను విశ్వాసఘాతుకుఁడ వగు మని నీవు హెచ్చరిక చేయుచున్నావు. నీవు స్వయం విశ్వాసఘాతుకుఁడవు; నిన్నుఁ జంపినచో బ్రహ్మహత్యా పాతకము సంభవింపదు. నిన్ను వధింతు' ననెను. మాట ముగియునంతలో ధీరానందుఁడు నిట్టూర్పు పుచ్చి పరుగిడిపోయేను. భవానందుఁడు వాని వెంట నంటి పోలేదు. వాఁడు కొంచెము సేపు అన్యమసస్కుఁడై యుండి, పిదప వెదకెను, వాఁడు కనఁబడ లేదు.


ముప్పదియొకటవ ప్రకరణము

భవానందుని మనోవ్యాకులము

భవానందుఁడు మఠమునకుఁ బోక గంభీరమైన వనమధ్యమునం బ్రవేశించెను. ఆకాననమం దొకవైపున పడిపోయిన గొప్ప మిద్దెయి ల్లుండెను. భగ్నా వశిష్ట మైనయిటికలు మొదలగువానిపై లతలును చెట్లును దట్టముగాఁ బెరిగి యుండెను. లెక్క లేని సర్పముల కాటపటై యుండెను. నేలఁగూలిన గదులలో నొక్క గదిమాత్రము కొంచెము బాగుగా నుండెను. భవా నందుఁడు ఆగదిలోఁ గూర్చుండి యాలోచింప నారంభించెను