పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

452

భక్తిరసశతకసంపుటము


కరులకుఁ దెల్పుచుండునట కాలుఁడు శ్రీకర రాజశేఖరా.

62


ఉ.

శంకర భక్తమానసవశంకర దుష్టనిశాటఝూటనా
శంకర శంఖపంకరుహచక్రహలాంకుశచాపముఖ్యరే
ఖాంకితతావకాంఘ్రియుగ మాదరలీల భజించునట్టి నీ
కింకరుఁ జేర రల్ల యమకింకరు లీశ్వర రాజశేఖరా.

63


ఉ.

సారెకు ధీరులై సుగుణసారత మీఱు భవత్కథాసుధా
ధారలుఁ గ్రోలుచున్ చరణదాస్యము సల్పెడు వారి వారినిన్
జేరినవారి దారికినిఁ జేరకుఁ డంచు యముండు దూతలన్
దూరుచు బల్కుచుండు భవదూర దయాకర రాజశేఖరా.

64


ఉ.

వారక సత్యదూరుల నివారితదర్శులఁ గర్మబాహ్యులన్
ఘోరుల బ్రహ్మఘాతకుల గోఘ్నుదుష్టుల దుర్మదాంధులన్
వారినిఁ జేరువారిదరి వారిని సారెకు మీఱి చీరఁగాఁ
జారులఁ బంచు కాలుఁ డనిశంబు పరాత్పర రాజశేఖరా.

65


ఉ.

లాలితభర్మనిర్మితవిలాసభవన్మణిమందిరస్థఘం
టాలపితధ్వనుల్ శ్రుతివిడంబనగా వినుచున్నవారల
క్కాల లులాయకంఠపరికల్పితభూరితరోగ్రఘంటికా
జాలనినాదముల్ వినరు సారగుణాకర రాజశేఖరా.

66