పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ముందటి దినములలోపల
గందమునకు సోమయోజి ఘనుఁ డందురు నే
డందురు ఘనుఁ లందఱు నను
కందానికిఁ గుందవరపు కవి చౌడప్పా.

12


క.

కందము నీవలెఁ జెప్పే
యందము మఱి గాన మెవరి యందును గవిసం
క్రందన యసదృశనూతన
కందర్పా కుందవరపు కవి చౌడప్పా.

13


క.

కందములఁ బ్రాససగణయతు
లందముగాఁ గవిత నెంద ఱల్లరు విను నీ
కందంబులు రసవన్మా
కందంబులు కుందవరపు కవి చౌడప్పా.

14


క.

కందంబులు సకల జనా
నందంబులు సరసమధుర నవరసఘటికా
బృందంబులు నీ కవితా
కందంబులు కుందవరపు కవి చౌడప్పా.

15


క.

మునుపటి సుకవుల నీతులు
జననుతములు కుందవరపు చౌడుని నీతుల్
వినవిన తేట తెనుంగై
కనపడుగద కుందవరపు కవి చౌడప్పా.

16


క.

నీతుల కేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా.

17