పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యర్కుఁ డుదయింపఁ జెడునె గుహాతిమిరము
తాళ మెత్తుకపోవ మందసములోని
విత్త మలవడకుండునే వెచ్చమునకు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

81


సీ.

ఆరగించంగ యోగ్యముగాక యుండునే
            పైతోలు బిరుసైన బనసఫలము
మాధుర్య మెడలునే మామిడిపండుకుఁ
            దొడిమపట్టున జీడి తొరలియున్న
గేదంగి నెఱిమౌళిఁ గీలింపకుందురే
            యగ్రభాగమున ముళ్ళలమికొన్న
నఖిలాంగసీమ యొయ్యారంబు గల్గిన
            యతివకు వాల్‍కన్నులైననేమి
గుణము బహుళంబు దోషంబు గొంచమైనఁ
గొదవఁ జెందక యుండు నెక్కుడు గుణంబు
తాఱుమాఱైన నిదియె పద్ధతి తలంప
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

82


సీ.

గోవధ గావించి గోరోజనమ్ము రో
            గార్తుల కొసఁగఁ బుణ్యాత్ముఁడగునె
ఫలశాఖిఁ బడ మొత్తి ఫలము లేఱించి భూ
            సురుల కర్పించిన సుకృతియగునె
నిండుతటాకంబు ఖండించి చేఁపల
            మత్స్యభుక్కులఁ దన్ప మాన్యుడగునె
గుడి కొట్టి యిటికలు గూరిచి తులసితి
            న్నెలు రచించిన ధర్మనిరతుఁడగునె
ప్రబలపాతకపూర్ణుఁ డల్పంపు సుకృత
మునను శుద్ధుండు గాకుండుననుట నిక్క
మాడు గాకేమి యిచ్చకం బనృతవాది
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

83