పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బెరుగుటయు విరుగుటకని నెఱుగలేక
యదరిపడుచుండు నొక్కొక్క యల్పజనుడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

74


సీ.

పాలన లేని భూపతిని గొల్చుట రోత
            యౌదార్యహీనుని నడుగ రోత
కులహీనజనులతోఁ గలహింపగను రోత
            గుణహీనజనులతో గూడ రోత
పాషండజనులపై భ్రాంతినొందుట రోత
            మధ్యపాయీలతో మైత్రి రోత
తుచ్ఛపు జనులకు నిచ్చనొందుట రోత
            చెలఁగి సద్గురు నిందసేయ రోత
వేదబాహ్యుల విద్యలు వినగ రోత
క్రూరుఁడైయున్న హరిభక్తుఁ గూడ రోత
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

75


సీ.

పసచెడి యత్తింటఁ బడి యుండుటది రోత
            పరువు దప్పినయెడ బ్రతుకు రోత
ఋణపడి సౌఖ్యంబు లనుభవించుట రోత
            పరుల కల్మికి దుఃఖపడుట రోత
తన కులాచారంబుఁ దప్పి నడచుట రోత
            ధరణీశునకు పిర్కితనము రోత
పిలువని పెత్తనంబులకుఁ బోవుట రోత
            యల్పుతో సరసంబులాడ రోత
ఒకరియాలిని గని వగనొంద రోత
సతికి జారపురుషుని బ్రతుకు రోత
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

76